టూకీగా ప్రపంచ చరిత్ర 50
కొత్త ఒరవడి
రెండోతరం చక్రాలు అచ్చంగా మన దేవాలయాల్లో ఊరేగింపులకు ఉపయోగించే రథాలకుండే చక్రాలవంటివి. నిలువు పట్టెలనూ, అడ్డ పట్టెలనూ పొరలు పొరలుగా అతికించి, దళసరిగా తయారైన తరువాత, వృత్తాకారంగా చెక్కిన కొయ్యచక్రం ఇది. ఈ తరహా చక్రానికి ఆనవాలుగా దక్షిణ యూరప్‌లోని స్లొవేనియాలో బయటపడ్డ బండి చక్రాలను తీసుకోవచ్చు. వాటి వయసు దాదాపు 5100 సంవత్సరాలని అంచనా. మన్నికకు పటిష్టమైనవే కావచ్చుగానీ, తూకం విషయంలోనే ఇవి మరో సమస్యను మోసుకొచ్చాయి. దాంతో, ఎక్కువ కాలం మన్నికయ్యేవేగాక, వీలైనంత తేలిగ్గా ఉండే చక్రాలకోసం పాకులాట మొదలైంది.
ఆ తరువాతి అంచెగా, ఇప్పుడు లారీలకూ, బస్సులకూ టైర్లు తగిలించుకునే డిస్కుకు ఐదుచోట్ల సమాన దూరంలో కోడిగుడ్డు ఆకారపు కంతలు చూస్తున్నామే, అదేపద్ధతిలో కంతలు చేసి, తూకం తగ్గించే ప్రయత్నం జరిగుండొచ్చు. దాని మూలంగా చక్రమంతా ఒకే ఘనపదార్థంగా ఉండవలసిన అవసరం లేదనే కిటుకు తెలిసుండొచ్చు. ఫలితంగా అనతికాలంలోనే ఆకుల చక్రం (స్పోక్డ్ వీల్) ఉనికిలోకి వచ్చుండాలి. ఈ తరహా చక్రానికి అతిపురాతనమైన ఆధారం సింధూ నాగరికతలో దొరికిన బొమ్మబండ్లకుండే మట్టిచక్రాలు. అదే ప్రదేశంలో దొరికిన ముద్రికల (సీల్స్) మీద ఆరు ఆకులుండే చక్రం చిత్రలిపిలో కనిపిస్తుంది. క్రీ.పూ. 2000 కాలంలో ఈజిప్టులో వాడింది ఇదే తరహా ఆరాకుల చక్రం కాగా, ఇంచుమించు అదే సమయంలో గ్రీకులు వాడింది నాలుగాకుల చక్రం.
చక్రం సాక్షాత్కారంతో నాగరికత రూపురేఖల్లో కొత్త జిలుగు ప్రవేశించింది. కుండలు చేసేందుకు సారె, నూలు వడికేందుకు రాట్నం వంటి పరికరాలు ఒకటొకటిగా జీవితానికి తోడుపడటం మొదలెట్టాయి. అంతదాకా కోతజంతువుగా మాత్రమే భావించబడిన పోతు జంతువుల హోదా హఠాత్తుగా మారి, ‘కాడిజంతువు’ ఉపయోగపడింది. ఎద్దులూ గాడిదల వంటి మందకొడి జంతువులు మాత్రమే. గుర్రం అప్పటికే పెంపుడు జంతువుల జాబితాలో చేరిపోయినా, దాని వేగానికి తట్టుకోగల బండిగానీ, సహకరించే రహదారులు గానీ ఇంకా రూపొందలేదు. గుర్రం వీపు మీద స్వారీ చేసే విధానం మొదట్లో లేదు. రథాలకు గుర్రాలను పూన్చడం మొదలైన చాలాకాలం తరువాత స్వారీ చేసే సాము అలవడింది. అందువల్లే, ఋగ్వేదంలో చెప్పిన ప్రయాణాలన్నీ రథాలమీదివి కాగా, గుర్రం మీద కూర్చున్నట్టు చెప్పే సందర్భాలు రెండు మాత్రమే కనిపిస్తాయి. అలాగే మహాభారతంలో గూడా గుర్రం మీది ప్రయాణం కనిపించేది రెండే రెండు చోట్ల. కురుక్షేత్ర యుద్ధం చివరిరోజున, రథం విరిగిపోగా కిందికి దిగిన దుర్యోధనుడు గుర్రమెక్కి యుద్ధ రంగం నుండి తప్పుకోవడం మొదటి సందర్భం.
అనుశాసనికపర్వంలోని ఒక ఉపాఖ్యానంలో ‘భంగాశ్వనుడు’ అనే రాజు గుర్రం మీద వేటకు వెళ్లడం రెండో సందర్భం. వీటిని బట్టి, గుర్రం చాలా కాలం దాకా కోత జంతువుగానే ఉండిపోయిందని అర్థమౌతుంది మనకు. ఎట్టకేలకు, క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం మధ్యలో, ‘ఇండో ఇరానియన్’దిగా చెప్పబడే సంస్కృతికి మూలపురుషులైన ‘ఆండ్రొనోవో’ తెగల నైపుణ్యంతో గుర్రాలు పూన్చేందుకు అనువైన రథాలు పురాతన ప్రపంచమంతా విస్తరించాయి. కాస్పియన్ సముద్రానికి తూర్పు తీరం మొదలు సైబీరియా దాకా విస్తరించిన ఈ ఆండ్రొనోవో తెగలు ప్రవేశపెట్టిన రెండు చక్రాల రథం అప్పట్లో అత్యాధునిక యుద్ధ శకటం. దానికి తొడిగిన చక్రానికుండే ఆకులు ఎనిమిది.
ఒక వైపు చక్రాన్ని ఆధునీకరించటానికి ప్రయాసలు పడుతూనే, మానవుడు మరోవైపు ‘లోహం’ మీద అధికారం సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగించాడు. లోహం మానవునికి కొత్తగా పరిచయమైన పదార్థం కాదు. ఆరుబయట ఎడతెరిపి లేకుండా మండే నానా రకాల శాఖల వేడికి పరిసరాల్లోని ఖనిజాలు కరిగి, నిప్పు చల్లారిన తావుల్లో తిరిగి గట్టిపడటం అతడు చాలాకాలంగా చూస్తున్నాడు. అది కేవలమొక వింతగా గమనించిన రోజులు గతించి, ‘ఎప్పుడు, ఎందుకు, ఎలా’ అనే ప్రశ్నలతో ఆలోచించడం మొదలెట్టిన తరువాత దాని ప్రయోజనం అతని చేతికి చిక్కింది.
రచన: ఎం.వి.రమణారెడ్డి