సిడ్నీ: ఈ ఏడాది రెండో టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో కేరళకు చెందిన ప్రణయ్ రన్నరప్‌గా నిలిచాడు. 90 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 9–21, 23–21, 20–22తో ప్రపంచ 24వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
ఈ ఏడాది మేలో మలేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించి టైటిల్ నెగ్గిన ప్రణయ్ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. తొలి గేమ్‌ను చేజార్చుకున్న ప్రణయ్ రెండో గేమ్‌లో తేరుకున్నాడు. పోటాపోటీగా సాగిన ఈ గేమ్‌లో పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. చివరకు స్కోరు 21–21 వద్ద వెంగ్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ స్మాష్ బయటకు వెళ్లింది. అనంతరం ప్రణయ్ నెట్ వద్ద పాయింట్ గెలిచి గేమ్‌ను దక్కించుకున్నాడు.
నిర్ణాయక మూడో గేమ్‌లో ప్రణయ్ దూకుడుగా ఆడి 19–14తో ఐదు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించాడు. అయితే వెంగ్ హాంగ్ యాంగ్ అసమాన పోరాటంతో కోలుకున్నాడు. స్కోరు 19–17 వద్ద ఏకంగా 71 షాట్‌ల ర్యాలీ సాగింది. చివరకు ప్రణయ్ కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో పాయింట్ వెంగ్ ఖాతాలోకి వెళ్లింది. అనంతరం వెంగ్ డ్రాప్ షాట్‌తో పాయింట్ గెలిచి స్కోరును 19–19తో సమం చేశాడు.
ఆ తర్వాత ప్రణయ్ పాయింట్ సాధించి విజయానికి ఒక పాయింట్ దూరంలో నిలిచాడు. కానీ పట్టువదలని వెంగ్ మళ్లీ స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత వెంగ్ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. విజేత వెంగ్ హాంగ్ యాంగ్‌కు 31,500 డాలర్ల (రూ. 26 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ప్రణయ్‌కు 15,960 డాలర్ల (రూ. 13 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment