భారత జట్టులో కొత్త కెరటం ప్రతీక రావల్
బ్యాటర్‌గా సత్తా చాటుతున్న సైకాలజీ స్టూడెంట్
చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన అమ్మాయి... మరోవైపు అంతే స్థాయిలో క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం... ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం అంత సులువు కాదు కాబట్టి ఏదో ఒకదానిని ఎంచుకోమని సన్నిహితులు చెప్పారు. కానీ ఇష్టంలో కష్టం ఉండదని ఆ అమ్మాయి నమ్మింది. అందుకే ఒకవైపు చదువులో ఉత్తమ విద్యారి్థనిగా ఉంటూనే తనకు నచ్చిన రీతిలో క్రికెట్‌లో కూడా సాధనను కొనసాగించింది.
ఫలితంగా ప్లస్ టు స్థాయిలో మంచి మార్కులు సాధించడం మాత్రమే కాదు... ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కూడా మారింది. ఇప్పుడు సైకాలజీ చదువుతూనే ఏకంగా భారత సీనియర్ జట్టులోకి ఎంపికైంది. ఓపెనర్‌గా భారత్ తరఫున ఆడిన 4 వన్డేల్లో 2 అర్ధసెంచరీలు సాధించిన ఢిల్లీ అమ్మాయి ప్రతీక రావల్ భవిష్యత్తులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. –సాక్షి క్రీడా విభాగం
భారత జట్టులో స్మృతి మంధానతో పాటు మరో ఓపెనర్‌గా షఫాలీ వర్మ ఐదేళ్ల పాటు రెగ్యులర్‌గా జట్టులో ఉంది. 16 ఏళ్లు పూర్తి కాక ముందే జట్టులోకి వచ్చిన షఫాలీ సంచలన బ్యాటింగ్, దూకుడైన శైలితో దూసుకుపోయింది. అయితే వరుస వైఫల్యాల తర్వాత సెలక్టర్లు షఫాలీపై వేటు వేసి కొత్త ఓపెనర్‌గా ప్రతీక రావల్‌ను ఎంపిక చేశారు. షఫాలీ స్థానంలో వచ్చిన ప్లేయర్ నుంచి సహజంగానే అలాంటి ధాటిని అంతా ఆశిస్తారు.
ఇప్పుడు నిలకడైన ప్రదర్శనతో 24 ఏళ్ల ప్రతీక తాను అందుకు తగిన దానినే అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ఆడిన 4 వన్డేల్లో ఆమె 82 స్ట్రయిక్‌రేట్‌తో వరుసగా 40, 76, 18, 89 పరుగులు సాధించి కెరీర్‌లో శుభారంభం చేసింది. దేశవాళీలో నిలకడైన ప్రదర్శన ఆమెకు ఈ అవకాశం కల్పించింది.
మూడేళ్ల క్రితం వన్డే టోర్నీలో 155 బంతుల్లో 161 పరుగులు చేసి ఢిల్లీని నాకౌట్ చేర్చడంతో ప్రతీకకు తొలిసారి గుర్తింపు లభించింది. ఆ తర్వాత బీసీసీఐ అండర్–23 టోర్నీలో 7 ఇన్నింగ్స్‌లలో 411 పరుగులతో టోర్నీలో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలవడంతో పాటు ఢిల్లీ సెమీఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది.
తండ్రి అండదండలతో...
ఢిల్లీలోని పశ్చిమ పటేల్ నగరంలో ఉండే ప్రదీప్ రావల్ కుటుంబం కేబుల్ టీవీ వ్యాపారంలో ఉంది. ప్రదీప్ అటు బిజినెస్‌లో భాగం కావడంతో పాటు ఢిల్లీ క్రికెట్ సంఘంలో బీసీసీఐ సర్టిఫైడ్ అంపైర్‌గా కూడా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి చాలాసార్లు మైదానానికి వెళ్లిన ప్రతీకకు సహజంగానే క్రికెట్‌పై ఆసక్తి ఏర్పడింది.
దాంతో 10 ఏళ్ల వయసు ఉన్న తన కూతురిని కోచ్ శ్రవణ్ కుమార్ వద్ద శిక్షణ కోసం ప్రదీప్ చేరి్పంచారు. భారత ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, నితీశ్ రాణా తదితరులకు కోచ్‌గా వ్యవహరించిన శ్రవణ్‌కు మంచి గుర్తింపు ఉంది. శ్రవణ్ శిక్షణ ఇచి్చన తొలి అమ్మాయి ప్రతీకనే కావడం విశేషం. ఆ తర్వాత స్కూల్ స్థాయి నుంచి కాలేజీ వరకు వేర్వేరు చోట్ల చక్కటి ప్రదర్శనలతో ఆమె ఆకట్టుకుంది.
క్రికెట్‌తో పాటు బాస్కెట్‌బాల్ కూడా బాగా ఆడుతూ వచ్చిన ప్రతీక 2019 జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిచిన ఢిల్లీ జట్టులో సభ్యురాలిగా కూడా ఉంది. సీబీఎస్‌ఈ ప్లస్ 2 పరీక్షల్లో 92.5 శాతం మార్కులతో ఆమె ఉత్తీర్ణురాలు కావడం విశేషం.
నిలకడైన ప్రదర్శనతో...
భిన్న రంగాల్లో సత్తా చాటుతున్నా... ప్రతీక అసలు లక్ష్యం మాత్రం క్రికెట్ వైపే సాగింది. దాంతో అండర్–17 స్థాయిలో మరింత మెరుగైన శిక్షణ అవసరమని భావించిన ఆమె రైల్వే కోచ్ ధ్యాని వద్ద చేరి తన ఆటకు మరింత మెరుగులు దిద్దుకుంది. 2022–23 దేశవాళీ వన్డే సీజన్‌లో 14 మ్యాచ్‌లలో కలిపి 552 పరుగులు చేయడం ద్వారా తన స్థాయిని పెంచుకుంది.
మరోవైపు ఢిల్లీ మహిళల జట్టు కోచ్, మాజీ ఆటగాడు దిశాంత్ యాజ్ఞిక్ కూడా ఆమె ఆటను తీర్చిదిద్దడంలో సహకరించాడు. బీసీసీఐ అండర్–23 స్థాయి టి20 టోర్నీలో కూడా రాణించిన ప్రతీక ఢిల్లీ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ ప్రదర్శనలు చూస్తే జాతీయ జట్టుకు ఎంతో దూరంలో లేదని అందరికీ అర్థమైంది.
మానసికంగా దృఢంగా...
‘నేను ఒకప్పుడు క్రికెటర్ కావాలని కలగన్నాను గానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు నా కూతురి రూపంలో నా కోరిక తీరింది’ అని ప్రదీప్ రావల్ గర్వంగా చెప్పుకుంటున్నారు. బీసీసీఐ విధుల్లో భాగంగా తండ్రి వడోదరలో ఉన్న సమయంలోనే ఆమెకు తొలి వన్డే ఆడే అవకాశం రావడం యాదృచ్చికం. తన కళ్ల ముందు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రతీకను చూస్తూ ఆ తండ్రి పుత్రికోత్సాహంతో కన్నీళ్లపర్యంతమయ్యారు.
సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతీక... తన చదువు క్రికెట్ కెరీర్‌కూ ఉపయోగపడుతోందని చెప్పుకుంది. ‘మనుషుల మనస్తత్వాలను చదవడం గురించి నాకు బాగా తెలుసు. దానిని అర్థం చేసుకోగలిగితే అటు మైదానంలో, మైదానం బయట కూడా పని సులువవుతుంది. మ్యాచ్‌కు ముందు ఇప్పుడు ఏం చేయాలో, తర్వాత ఏం చేయాలో అనే విషయంపై నాతో నేను సానుకూలంగా మాట్లాడుకుంటా.
బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా నేను అత్యుత్తమ ప్లేయర్‌గా, ఏదైనా చేయగలనని భావించుకుంటా. అది నాకు సైకాలజీనే నేర్పింది’ అని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుత జోరును కొనసాగించి ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో భాగం కావాలని ప్రతీక ప్రస్తుత లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment