ఉత్కంఠ పోరులో జైపూర్‌దే పైచేయి | Pro Kabaddi League 2024 November 5th Highlights: Jaipur Pink Panthers Beat UP Yoddhas With 33-30 | Sakshi
Sakshi News home page

Pro Kabaddi League 2024: ఉత్కంఠ పోరులో జైపూర్‌దే పైచేయి

Published Tue, Nov 5 2024 9:34 PM | Last Updated on Wed, Nov 6 2024 1:34 PM

Pro Kabaddi League 2024: Jaipur Pink Panthers Beat UP Yoddhas
  • రెండు ఓటములు, ఒక టై త ర్వాత జైపూర్‌ పాంథర్స్‌ గెలుపు బాట
  • 33–30తో యూపీ యోధాస్‌పై ఉత్కంఠ విజయం
  • 1000 రెయిడ్ పాయింట్లు మైలురాయికి అర్జున్ దేశ్వాన్‌
  • ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11

హైదరాబాద్‌, :ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో  రెండు ఓటములు, ఒక టై తర్వాత మాజీ చాంపియన్‌ జైపూర్ పింక్ పాంథర్స్‌ తిరిగి గెలుపు బాట పట్టింది. ఆరంభం నుంచి ఉత్కంఠగా సాగుతూ ఆధిపత్యం చేతులు మారిన పోరులో చివర్లో అద్భుతంగా ఆడిన జైపూర్‌‌... యూపీ యోధాస్‌కు చెక్ పెట్టి లీగ్‌లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. 

మంగళవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీకెఎల్‌ 11 లీగ్‌ దశ మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ జట్టు 33–30 స్కోరుతో యూపీ యోధాస్‌పై గెలిచింది. జైపూర్ జట్టులో రెయిడర్ నీరజ్‌ నర్వాల్ తొమ్మిది పాయింట్లతో  మెరిశాడు. కెప్టెన్‌, మరో స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్‌ ఐదు పాయింట్లతో రాణించాడు.ఈ క్రమంలో పీకేఎల్‌లో 1000 రెయిడ్ పాయింట్ల మైలురాయి చేరుకున్నాడు. యోధాస్ తరఫున ఆల్‌రౌండర్ భరత్  ఏడు, హితేశ్‌, సుమిత్ చెరో ఐదు పాయింట్లు రాబట్టినా తమ జట్టుకు వరుసగా మూడో ఓటమి తప్పించలేకపోయారు.

హోరాహోరీ పోరు
జైపూర్‌‌, యూపీ మధ్య ఆట ఆరంభం నుంచి నువ్వానేనా అన్నట్టు నడిచింది. ఇరు జట్లూ బలమైన డిఫెన్స్‌ ను ప్రదర్శించాయి. దాంతో ఆటలో ఆధిపత్యం కోసం శ్రమించాయి. బోనస్  ద్వారా అర్జున్‌  జైపూర్‌‌కు తొలి పాయింట్ అదించగా.. గగన్‌ యూపీ యోధాస్‌ ఖాతా తెరిచాడు.  యూపీ డిఫెండర్లు రెండుసార్లు అర్జున్‌ను ట్యాకిల్‌ చేయగా.. రితిక్‌, భవానీ రాజ్‌పుత్‌ తెచ్చిన రైడ్ పాయింట్లతో ఆ జట్టు 6–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, జైపూర్ వెంటనే పుంజుకొని 6–6తో స్కోరు సమం చేసింది. ఇరు జట్లూ ఎక్కడా తగ్గకపోవడంతో స్కోరు బోర్డు 8–8, 11–11, 15–15తో సమంగా  నడిచింది. తొలి అర్ధభాగానికి ముందు యూపీ జట్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగిలినా.. అర్జున్‌ను సూపర్‌‌ ట్యాకిల్‌ చేసి 17–15తో స్వల్ప ఆధిక్యంతో విరామానికి వెళ్లింది.

జైపూర్ జోరు
రెండో అర్ధభాగంలో యూపీ బలమైన డిఫెన్స్‌ను ప్రదర్శించింది. విరామం నుంచి వచ్చిన వెంటవెంటనే రెండు సూపర్ ట్యాకిల్స్‌తో నీరజ్‌, అర్జున్‌ను నిలువరించి 21–17తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. కానీ, జైపూర్‌‌ వెనక్కు తగ్గలేదు. ఆ జట్టు డిఫెండర్లు కూడా పుంజుకున్నారు. యోధాస్ కెప్టెన్‌ సురేందర్‌‌ను ట్యాకిల్ చేయడంతో పాటు కోర్టులో మిగిలిన సుమిత్‌ను నిలువరించిన పింక్ పాంథర్స్‌ 32వ నిమిషంలో  ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి 22–22తో స్కోరు సమం చేసింది. 

ఈ దశలో జైపూర్ కెప్టెన్‌ అర్జున్‌తో పాటు ఆ జట్టు మరో స్టార్ రెయిడర్‌‌ నీరజ్‌ను బెంచ్‌ మీదకు పంపించిన యూపీ 25–22తో తిరిగి ఆధిక్యం అందుకుంది. అయితే, చివరి పది నిమిషాల్లో  జైపూర్ జోరు పెంచింది. నీరజ్‌ వరుస రెయిడ్ పాయింట్లు రాబట్టగా.. డిఫెండర్లు కూడా ఆకట్టుకోవడంతో 36వ నిమిషంలో ప్రత్యర్థిని మరోసారి ఆలౌట్‌ చేసి 31–28తో మళ్లీ పైచేయి సాధించింది. ఆఖరి నిమిషాల్లో యూపీ యోధాస్ పుంజుకునే ప్రయత్నం చేసినా ఆధిక్యాన్ని కాపాడుకున్న జైపూర్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement