Wrestlers Protesting On Streets Indiscipline, Tarnishing India's Image, Says PT Usha - Sakshi
Sakshi News home page

Wrestlers Protest: దేశ ప్రతిష్టతను దిగజారుస్తున్నారు.. పీటీ ఉష ఘాటు వ్యాఖ్యలు

Published Fri, Apr 28 2023 8:56 AM | Last Updated on Fri, Apr 28 2023 11:33 AM

Protest not good for Indias image, says P T Usha - Sakshi

న్యూఢిల్లీ: తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధానిలో ఐదు రోజులుగా నిరసన కొనసాగిస్తున్న అగ్రశ్రేణి రెజ్లర్లకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నుంచి అనూహ్య స్పందన ఎదురైంది. వారి తీరును తప్పుపడుతూ ఐఓఏ అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారు వీధుల్లోకి వెళ్లకుండా ఉండాల్సిందని ఆమె సూచించింది.

‘లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ఐఓఏలో ఒక కమిటీతో పాటు అథ్లెటిక్స్‌ కమిషన్‌ కూడా ఉంది. వారంతా వీధుల్లోకి వెళ్లకుండా మా వద్దకు రావాల్సింది. కానీ వారు అలా చేయలేదు. కొంత క్రమశిక్షణ కూడా అవసరం. వారు చేస్తున్న పని ఆటకు మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు మంచి పేరు ఉంది.

ఇలాంటి నిరసనల వల్ల దేశం పరువు పోతోంది. ఈ తరహా ప్రతికూల ప్రచారం దేశానికి మంచిది కాదు. ఏదైనా చట్టప్రకారం ఉండాలి. వారంతా ధర్నాలో కూర్చొని రాజకీయ పార్టీల మద్దతు కోరడం నన్ను తీవ్రంగా నిరాశపరుస్తోంది’ అని పీటీ ఉష అభిప్రాయపడింది. ఉష మాటలపై స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

‘ఆమె స్వయంగా ఒక అథ్లెట్‌. పైగా మహిళ కూడా. మేం ఆమె మద్దతు కోరుకున్నాం. కానీ ఆమె నుంచి ఇలాంటి తీవ్రమైన స్పందన ఊహించలేదు. రెజ్లర్ల చర్య వల్ల భారత్‌ పరువు పోతోంది అని భావిస్తే గతంలో తన అకాడమీలో కొందరు గూండాలు తనను వేధిస్తున్నారంటూ ఆమె అందరి ముందు ఏడవలేదా. అప్పుడేం జరిగింది’ అంటూ బజరంగ్‌ గుర్తు చేశాడు.  

వారికీ అవకాశమిచ్చాం: క్రీడల మంత్రి ఠాకూర్‌ 
రెజ్లర్ల సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతోందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. తమ వైపు నుంచి అన్ని విషయాలను వెల్లడించేందుకు రెజ్లర్లకు తగినంత అవకాశం ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం తొలిసారి వారు నిరసన జరిపినప్పుడు తాను స్వయంగా 12 గంటల పాటు వారితో చర్చలు జరిపానని... విచారణ కమిటీ 14 సార్లు సమావేశాలు నిర్వహించి ఆటగాళ్లు తమ బాధలు చెప్పుకునే అవకాశం ఇచ్చిందని ఠాకూర్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement