పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 చివరి అంకానికి చేరుకున్న సమయంలో ఇద్దరు అంతర్జాతీయ స్టార్ల మధ్య జరిగిన గొడవ లీగ్ మొత్తానికే కలంకంగా మారింది. లీగ్‌లో భాగంగా నిన్న (మార్చి 15) జరిగిన మ్యాచ్‌లో సుల్తాన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్‌పై ఖలందర్స్ బౌలర్ షాహీన్ అఫ్రిది దాదాపుగా చేయి చేసుకున్నంత పని చేశాడు. తన బౌలింగ్‌లో పోలార్డ్ 4 సిక్సర్లు (ఒక ఓవర్‌లో 1, ఇంకో ఓవర్ 3) బాదడంతో సహనం కోల్పోయిన అఫ్రిది.. దూషణ పర్వానికి దిగగా, పోలీ సైతం అంతే ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు.
Shaheen Afridi and Kieron Pollard 😲#PSL8 #LQvMSpic.twitter.com/HM9CP5Y8tC
— Cricket Pakistan (@cricketpakcompk) March 15, 2023
అయితే సొంతగడ్డ అడ్వాంటేజ్ తీసుకున్న అఫ్రిది ఓవరాక్షన్ చేసి పోలార్డ్‌పైకి దూసుకెళ్లడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం సహచరులు సర్ది చెప్పడంతో వెనక్కు తగ్గిన అఫ్రిది తన పని తాను చేసుకున్నాడు. అఫ్రిది-పోలార్డ్ మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో అఫ్రిది చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు పాక్ యువ పేసర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌పై 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ముల్తాన్ సుల్తాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. పోలార్డ్ (34 బంతుల్లో 57; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్ కాట్రెల్ (3-0-20-3), ఉసామా మిర్ (2-0-12-2) ధాటికి ఖలందర్స్ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది.
సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ (19), డేవిడ్ వీస్ (12), హరీస్ రౌఫ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఖలందర్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ బౌలర్లలో కాట్రెల్ 3, మిర్ 2, అన్వర్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ పడగొట్టారు.
రెండో ఫైనల్ బెర్తు ఎవరిది..?
ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఎలిమినేటర్ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment