హెండ్రిక్స్‌ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్‌ మలాన్‌ | PSL 2024: Multan Sultans Beat karachi Kings By 55 Runs | Sakshi
Sakshi News home page

హెండ్రిక్స్‌ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్‌ మలాన్‌

Published Mon, Feb 19 2024 3:52 PM | Last Updated on Mon, Feb 19 2024 4:30 PM

PSL 2024: Multan Sultans Beat karachi Kings By 55 Runs - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌ మూడో మ్యాచ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ ఆటగాడు రీజా హెండ్రిక్స్‌ రెచ్చిపోయాడు. కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెండ్రిక్స్‌తో పాటు డేవిడ్‌ మలాన్‌ (41 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్‌) కూడా మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముల్తాన్‌ సుల్తాన్స్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

సుల్తాన్స్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (11) విఫలం కాగా.. ఆఖర్లో ఖుష్దిల్‌ షా (13 బంతుల్లో 28 నాటౌట్‌; 4 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించాడు. కరాచీ బౌలర్లలో మీర్‌ హమ్జా, డేనియల్‌ సామ్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం​ లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ.. మొహమ్మద్‌ అలీ (4-0-23-3), డేవిడ్‌ విల్లే (4-0-22-2), అబ్బాస్‌ అఫ్రిది (3-0-16-2), ఉసామా మిర్‌ (4-0-14-1) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సుల్తాన్స్‌ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరాచీ ఇన్నింగ్స్‌లో షోయబ్‌ మాలిక్‌ (53), కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (30), కీరన్‌ పోలార్డ్‌ (28 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కరాచీ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లు కావడం విశేషం​. 

రాయ్, షకీల్‌ మెరుపు అర్దసెంచరీలు
నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పెషావర్‌ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌
చేసిన గ్లాడియేటర్స్‌.. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (75), సౌద​ షకీల్‌ (74) మెరుపు అర్దసెంచరీలతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 206 పరుగులు చేయగా.. ఛేదనలో చివరి వరకు పోరాడిన పెషావర్‌ లక్ష్యానికి 17 పరుగుల దూరంలో (190/6) నిలిచిపోయింది. పెషావర్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బాబర్‌ ఆజమ్‌ (68), సైమ్‌ అయూబ్‌ (42) రాణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement