![Rahul Dravid re-applies for National Cricket Academy Head post - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/08/19/DRAVID_YU1MA.jpg.webp?itok=hfL1dhPr)
న్యూఢిల్లీ: బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ‘హెడ్ ఆఫ్ క్రికెట్’ పదవికి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఒక్కడే మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఇంకెవరు పోటీలో లేరు. దీంతో అతనే మరో సారి ఎన్‌సీఏ చీఫ్‌గా ఖాయమైనప్పటికీ విమర్శలకు తావివ్వరాదనే ఉద్దేశంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తు గడువును పొడిగించింది. రెండేళ్ల క్రితం ఎన్‌సీఏ చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ద్రవిడ్ తనదైన ముద్ర వేశాడు. కుర్రాళ్లకు, పునరావాస శిబిరానికి వచ్చిన ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా మారాడు.
భారత్ ‘ఎ’, జూనియర్ జట్ల కోచ్‌గా రిజర్వ్ బెంచ్ సత్తా పెంచాడు. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌కే అన్నివైపులా అనుకూలతలు, అర్హతలు ఉన్నాయని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరో వైపు గాయాలతో బాధపడుతున్న యువ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, కమలేశ్ నాగర్‌కోటి ఎన్‌సీఏ పునరావాస శిబిరానికి చేరగా, శుబ్‌మన్ గిల్ ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు. ఈ ముగ్గురు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లంతా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సంతరించుకుంటే యూఏఈలో జరిగే ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment