న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడ్డారు. దీంతో జట్టుతో పాటు ఆసియా కప్ టి20 టోర్నీ కోసం ద్రవిడ్ దుబాయ్ విమానం ఎక్కలేదు. ‘అక్కడికి బయల్దేరే ముందు రొటీన్‌గా చేసే కోవిడ్ పరీక్షల్లో ద్రవిడ్‌కు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆయనకు అతి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. దీంతో ఆయన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్ష చేసి నెగెటివ్ రిపోర్టు రాగానే ద్రవిడ్ యూఏఈకి పయనమవుతారు’ అని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు.
ప్రస్తుతానికి సహాయక కోచ్ పారస్ మాంబ్రే ఇన్‌చార్జి కోచ్‌గా వ్యవహరిస్తారు. ఆసియా కప్‌కు ఎంపికైన రోహిత్ శర్మ బృందంలో ముగ్గురు మినహా మెజారిటీ సభ్యులంతా మంగళవారం ఉదయం దుబాయ్‌కి పయనమయ్యారు. జింబాబ్వేలో ఉన్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా, రిజర్వ్ ప్లేయర్ అక్షర్ పటేల్‌లు హరారే నుంచే అక్కడికి బయల్దేరతారు. ఆసియా కప్ ప్రధాన టోర్నీ యూఏఈలో ఈనెల 27 నుంచి జరుగుతుంది. 28న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment