న్యూఢిల్లీ: సాగర్ రాణా అనే యువ రెజ్లర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న 2008 బీజింగ్ ఒలింపిక్ కాంస్య పతక విజేత సుశీల్ కుమార్‌ను ఇటీవలే ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఇదే కేసుకు సంబంధించి అతన్ని రైల్వే ఉద్యోగం నుంచి తొలగించాలని ఉత్తర రైల్వే నిర్ణయించినట్లు ఆ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం సుశీల్ కుమార్ ఉత్తర రైల్వేస్ లో ఆఫీసర్ ఆన్ డ్యూటీగా విధులు నిర్వహిస్తున్నాడు.
హత్య కేసుకు సంబంధించిన రిపోర్టు ఢిల్లీ ప్రభుత్వం నుంచి రైల్వే బోర్డుకు అందిన నేపథ్యంలో అతనిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ఉత్తర రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ పీటీఐకి తెలిపారు. రెండు రోజుల్లో సుశీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. కాగా, నెల రోజుల క్రితం ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ అనే యువకుడిపై సుశీల్ కుమార్ దాడి చేశాడు. ఈ దాడిలో సాగర్ మరణించడంతో అతనిపై ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యానేరం కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment