సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మధ్యప్రదేశ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ (డిసెంబర్ 13) సాయంత్రం జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది.
అనుజ్ రావత్ (33 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియాన్ష్ ఆర్య 29, యశ్ ధుల్ 11, ఆయుశ్ బదోని 19, హిమ్మత్ సింగ్ 15, మయాంక్ రావత్ 24, హర్ష్ త్యాగి 9 (నాటౌట్) పరుగులు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్ 2, కుమార్ కార్తికేయ, ఆవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
రెచ్చిపోయిన రజత్ పాటిదార్
147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. రజత్ పాటిదార్ రెచ్చిపోవడంతో 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రజత్ పాటిదార్ 29 బంతుల్లో 4 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
పాటిదార్‌కు హర్ప్రీత్ సింగ్ భాటియా (46 నాటౌట్) సహకరించాడు. ఆదిలో ఓపెనర్ హర్ష్ గావ్లి (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హిమాన్షు చౌహాన్ ఓ వికెట్ తీశాడు.
ఫైనల్లో మధ్యప్రదేశ్
ఢిల్లీపై గెలుపుతో మధ్యప్రదేశ్ ఫైనల్లోకి ప్రవేశించింది. డిసెంబర్ 15న జరిగే ఫైనల్లో మధ్యప్రదేశ్ ముంబైని ఢీకొంటుంది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బరోడాపై గెలిచి ముంబై ఫైనల్‌కు చేరింది. రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించి ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment