చిన్న జట్టు చేతిలో పరాభవం ఓ యువ క్రికెటర్ కెప్టెన్సీకి ఎసరు తెచ్చిపెట్టింది. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా పసికూన పుదుచ్చేరి చేతిలో ఓడటంతో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ కెప్టెన్ యశ్ ధుల్‌ను పదవి నుంచి తొలగించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న పుదుచ్చేరి చేతిలో పటిష్టమైన తమ జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఢిల్లీ పెద్దలు మరో ఆలోచన లేకుండా కెప్టెన్‌పై వేటు వేశారు.
కెప్టెన్సీ నుంచి యశ్ ధుల్‌ను తొలగించడంపై ఢిల్లీ హెడ్ కోచ్ దేవాంగ్ పటేల్ మాట్లాడుతూ.. యశ్ ధుల్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం అనేది సెలెక్టర్ల నిర్ణయం. నా వరకైతే యశ్ ఢిల్లీ క్రికెట్‌తో పాటు టీమిండియాకు భవిష్యత్తు. ఇలాంటి ఆటగాడు కెప్టెన్సీ కారణంగా పరుగులు చేయలేకపోతున్నాడు. యశ్ ముందుగా పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను. యశ్‌ను పరుగులు చేయనీకుండా నియంత్రించే దేన్నైనా ముందుగా పక్కకు పెట్టాలి. కెప్టెన్సీ భారం అతన్ని బ్యాటింగ్‌పై దృష్టి పెట్టనీయకుండా చేస్తుంది. అందుకే సెలెక్టర్లు అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారని భావిస్తున్నాను.
తదుపరి జరిగే మ్యాచ్‌కు యశ్ ధుల్ స్థానంలో మిడిలార్డర్ ఆటగాడు హిమ్మత్ సింగ్ ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆయుశ్ బదోని హిమ్మత్ సింగ్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వ్యవహరిస్తానడి దేవాంగ్ పటేల్ తెలిపాడు.
కాగా, సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో పసికూన పుదుచ్చేరి చేతిలో ఢిల్లీ జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 148, రెండో ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసిన పుదుచ్చేరి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసి ఢిల్లీపై సంచలన విజయం సాధించింది. పుదుచ్చేరి బౌలర్ గౌరవ్ యాదవ్ 10 వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాశించాడు. ఢిల్లీ జట్టులో ఇషాంత్ శర్మ, నవ్‌దీప్ సైనీ లాంటి స్టార్ పేసర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment