ఉమ్రాన్ మాలిక్ (ఫైల్ ఫొటో- PC: BCCI)
Ranji Trophy 2023-24- Puducherry vs Jammu and Kashmir: టీమిండియాలో స్థానం కోల్పోయిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించాడు. రంజీ ట్రోఫీ-2024 బరిలో దిగాడు ఈ 24 ఏళ్ల పేసర్. అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ అతడి వైఫల్యం కొనసాగుతోంది.
కాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్ కూడా ఒకడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్‌గా చేరి.. జట్టులో కీలక సభ్యుడి స్థాయికి ఎదిగాడు.
టీమిండియాలో చోటు కరువు
అయితే, గత రెండు సీజన్లుగా ఉమ్రాన్ మాలిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో తుదిజట్టులోనూ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. లీగ్ క్రికెట్ పరిస్థితి ఇలా ఉంటే.. టీమిండియాలోనూ అతడికి చోటు కరువైంది.
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఉమ్రాన్ మాలిక్.. ఇప్పటి వరకు 8 టీ20లు, 10 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో ఈ ఫాస్ట్ బౌలర్ వరుసగా 11, 13 వికెట్లు తీశాడు.
అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు ఉమ్రాన్‌ను పక్కనపెట్టేశారు. ఈ క్రమంలో గతేడాది జూలైలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఈ కశ్మీరీ బౌలర్ టీమిండియా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడాడు.
ఈ క్రమంలో పరిమిత ఓవర్లలో సత్తా చాటలేకపోయిన ఉమ్రాన్.. రంజీ బరిలో దిగి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే, ఇంతవరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
రంజీల్లోనూ వరుస వైఫల్యాలు
తాజా రంజీ సీజన్‌లో ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ మాలిక్.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వర్షం కారణంగా ఆయా మ్యాచ్‌లకు ఆటంకం కలిగినప్పటికీ తనకు బౌలింగ్ చేసే అవకాశం వచ్చినపుడు కూడా ఉమ్రాన్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.
తాజాగా పుదుచ్చేరితో మ్యాచ్‌లోనూ తన వైఫల్యం కొనసాగించాడు. పుదుచ్చేరి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జమ్మూ కశ్మీర్ తొలుత బ్యాటింగ్ చేసి.. 106 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి 172 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి 66 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కాగా పుదుచ్చేరి మొదటి ఇన్నింగ్స్‌లో కశ్మీర్ బౌలర్లు అబిద్ ముస్తాక్, వన్షజ్ శర్మ ఐదేసి వికెట్లు పడగొట్టగా ఉమ్రాన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా.. డకౌట్
ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఉమ్రాన్ డకౌట్ అయ్యాడు. వికెట్ కీపర్ ఫాజిల్ రషీద్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కశ్మీర్ 152 పరుగులకే చాపచుట్టేసింది.
ఈ క్రమంలో 86 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చేరి శనివారం నాటి ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 35 రన్స్ చేసింది. విజయానికి పుదుచ్చేరి 52 పరుగుల దూరంలో నిలవగా.. జమ్మూ కశ్మీర్ ఇంకో మూడు వికెట్లు పడగొడితే గెలుపొందుతుంది.
అయితే, పుదుచ్చేరి రెండో ఇన్నింగ్స్‌లో ఉమ్రాన్‌కు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. అబిద్ ముస్తాక్ మరోసారి 5 వికెట్లు తీయగా.. వన్షజ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తానికి రంజీల్లోనైనా ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటుతాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. టీమిండియా భవిష్యత్ స్పీడ్‌గన్‌గా నీరాజనాలు అందుకున్న ఉమ్రాన్ మాలిక్ ఇప్పట్లో పునరాగమనం చేసే అవకాశం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment