రికార్డుపుటల్లోకెక్కిన కేరళ క్రికెటర్‌ | Ranji Trophy 2024: Jalaj Saxena Becomes Third Indian Player To Score 9000 Runs And 600 Wickets | Sakshi
Sakshi News home page

రికార్డుపుటల్లోకెక్కిన కేరళ క్రికెటర్‌

Published Mon, Jan 8 2024 12:47 PM | Last Updated on Mon, Jan 8 2024 12:57 PM

Ranji Trophy 2024: Jalaj Saxena Becomes The Third Indian Player Score 9000 Runs And 600 Wickets Across Domestic Formats - Sakshi

కేరళ క్రికెటర్‌ జలజ్‌ సక్సేనా రికార్డుపుటల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సమర్థ్‌ సింగ్‌ వికెట్‌ తీయడంతో దేశవాలీ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు కలిపి) 600 వికెట్ల అరుదైన మైలురాయిని తాకాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అయిన జలజ్‌.. ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టడంతో పాటు 9000కు పైగా పరుగులు చేసి అత్యంత అరుదైన డబుల్‌ను సాధించాడు. జలజ్‌కు ముందు దేశవాలీ క్రికెట్‌లో ఈ ఘనతను కేవలం ఇద్దరు మాత్రమే సాధించారు. వినూ మన్కడ్‌, మదన్‌ లాల్‌ మాత్రమే ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో 9000 పరుగులు, 600 వికెట్ల మైలురాయిని తాకారు. 

ఇదిలా ఉంటే, కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ​ పట్టుబిగించింది. నాలుగో రోజు లంచ్‌ విరామం సమయానికి ఆ జట్టు 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. యూపీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆర్యన్‌ జుయెల్‌ (115) సెంచరీతో కదంతొక్కగా.. ప్రియం గార్గ్‌ (95) సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. సమర్థ్‌ సింగ్‌ (43) ఓ మోస్తరుగా రాణించగా.. ప్రియం గార్గ్‌కు జతగా ఆక్ష్‌దీప్‌ సింగ్‌ (28) క్రీజ్‌లో ఉన్నాడు. జలజ్‌ సక్సేనా, బాసిల్‌ థంపి తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. కేరళ ఇన్నింగ్స్‌లో విష్ణు వినోద్‌ (74) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. సంజూ శాంసన్‌ (25), శ్రేయస్‌ గోపాల్‌ (36), సచిన్‌ బేబి (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంకిత్‌ రాజ్‌పుత్‌ 5 వికెట్ల ఘనతతో కేరళ పతనాన్ని శాశించగా.. కుల్దీప్‌ యాదవ్‌ 3, యశ్‌ దయాల్‌, సౌరభ్‌ కుమార్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

దీనికి ముందు యూపీ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైంది. రింకూ సింగ్‌ (92) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. దృవ్‌ జురెల్‌ (63) అర్ధసెంచరీతో రాణించాడు. నిదీశ్‌ 3, జలజ్‌ సక్సేనా, బాసిల్‌ థంపి తలో 2 వికెట్లు, వైశాక్‌ చంద్రన్‌, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement