క్రికెట్ చ‌రిత్ర‌లోనే వింత ఔట్ అంటే ఇదేనేమో! | Rare Dismissal In Cricket History, Sompal Kami Out For Hitting The Ball Twice In NPL 2026, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

క్రికెట్ చ‌రిత్ర‌లోనే వింత ఔట్ అంటే ఇదేనేమో!

Nov 10 2026 9:14 PM | Updated on Nov 11 2026 8:42 AM

Rare-Dismissal-Ever-Cricket History-Batter-Out-Hitting-Ball-Twice-NPL-2026

Photo Credit: Twitter

క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత వింతైన ఔట్ నేపాల్ ప్రీమియ‌ర్ లీగ్ (ఎన్‌పీఎల్-2026)లో చోటుచేసుకుంది. క‌ర్నాలీ యాక్స్ కెప్టెన్ సోంపాల్ కామి ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ (బంతిని ఉద్దేశ‌పూర్వ‌కంగా కొట్టడం)గా అవుట్ అయ్యాడు. ఈ లీగ్ చరిత్రలో ఈ విధంగా అవుట్ అయిన మొదటి ఆటగాడిగా సోంపాల్ కామి రికార్డుకెక్కాడు. 

విష‌యంలోకి వెళితే.. 2026 నవంబర్ 9న కీర్తిపూర్‌లోని త్రిభువన్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో కర్నాలీ యాక్స్, పోఖారా అవెంజర్స్ జట్ల మధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. 218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, 15వ ఓవర్ చివరి బంతిని పోఖారా స్పిన్నర్ బిపిన్ ఖత్రి ఆఫ్-స్టంప్ వెలుపల విసిరాడు. 

షాట్ ఆడటానికి ప్రయత్నించిన సోంపాల్ కామి బ్యాట్‌కు బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని అతని కాళ్ల దగ్గరే ఆగిపోయింది. షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో అసహనానికి గురైన సోంపాల్, బంతి ఇంకా ఆటలో ఉండగానే తన బ్యాట్‌తో ఆ బంతిని రెండోసారి ఆఫ్-సైడ్ వైపు కొట్టాడు. పోఖారా అవెంజర్స్ ఫీల్డర్లు వెంటనే అప్పీల్ చేయడంతో, ఆన్-ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్ మసూదుర్ రెహమాన్ అతడిని అవుట్‌గా ప్రకటించారు. అప్పటికి సోంపాల్ 19 బంతుల్లో 21 పరుగులు చేసి ఉన్నాడు

నిబంధ‌నలు ఏం చెబుతున్నాయంటే?
ఎంసీసీ (MCC) క్రికెట్ నిబంధనలలోని లా 37.1 (Law 37.1) ప్రకారం, బంతి ఆటలో ఉన్నప్పుడు బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా బంతిని రెండోసారి బ్యాట్‌తో గానీ, శరీరంతో గానీ తాకితే 'అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' కింద అవుట్ ఇస్తారు. (గతంలో 'హిట్ ద బాల్ ట్వైస్' అనే ప్రత్యేక నిబంధన ఉండేది, ఇప్పుడు దీనిని ఈ నిబంధనలోనే విలీనం చేశారు).

కేవలం బంతి స్టంప్స్‌ను తాకకుండా వికెట్లను రక్షించుకునే ఉద్దేశంతో మాత్రమే బ్యాటర్ బంతిని రెండోసారి ఆపే అవకాశం ఉంటుంది. సోంపాల్ కొట్టిన బంతి వికెట్లకు ఎలాంటి ప్రమాదం కలిగించే స్థితిలో లేకపోవడంతో, అంపైర్లు అతడిని అవుట్‌గా ప్రకటించారు.

ఇదీ చదవండి: గిల్ రికార్డును స‌మం చేసిన ఆర్య‌వీర్ సెహ్వాగ్‌

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement