ఢిల్లీపై అదే మా ప్రణాళిక: రషీద్‌ ఖాన్‌ | Rashid Khan Explains Sunrisers Plan On Taking Down Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీపై అదే మా ప్రణాళిక: రషీద్‌ ఖాన్‌

Published Sat, Nov 7 2020 5:15 PM | Last Updated on Sat, Nov 7 2020 7:49 PM

Rashid Khan Explains Sunrisers Plan On Taking Down Delhi - Sakshi

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరగబోయే క్వాలిఫయర్‌-2కు తాము సిద్ధంగా ఉన్నట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తెలిపాడు. తాము ఎంతో ఒత్తిడిలో వరుసగా మ్యాచ్‌లు గెలుచుకుంటూ వస్తున్నామని అదే ఆత్మవిశ్వాసాన్ని ఢిల్లీతో పోరులో కూడా కొనసాగిస్తామన్నాడు. ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఒక దశలో తాము కఠిన పరిస్థితిని ఎదుర్కొన్నామని రషీద్‌ పేర్కొన్నాడు. (కోహ్లి ట్రిక్‌ వర్కౌట్‌ కాలేదు..రిప్లై అదిరింది!)

కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన రెండో అంచె మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో పరాజయం చవిచూసిన సందర్భం మళ్లీ వస్తుందా అనిపించిందన్నాడు. కాకపోతే ఇది ఎలిమినేటర్‌ మ్యాచ్‌ కావడంతో ఆందోళనకు గురైనట్లు తెలిపాడు. చివరకు విజయం సాధించడంతో ఊపిరి పీల్చుకున్నామన్నాడు. ఇక ఢిల్లీతో క్వాలిఫయర్‌-2కు తమ జట్టు సిద్ధంగా ఉందన్నాడు. అబుదాబి పిచ్‌ చాలా స్లోగా ఉందన్న రషీద్‌.. బేసిక్స్‌ను కచ్చితంగా అవలంభిస్తే సరిపోతుందన్నాడు. అదే తమ ప్రణాళిక అని రషీద్‌ అన్నాడు. ఇక తన ప్రదర్శనకు వచ్చేసరికి రైట్‌ లెంగ్త్‌ బాల్‌ను వేయడంపైనే దృష్టి పెట్టానన్నాడు. తాను ఫుల్‌ లెంగ్త్‌ బాల్‌ను వేసినప్పుడు పరుగులు సమర్పించుకున్నానే విషయం గ్రహించానన్నాడు.

తన వీడియోలను ఒకసారి రివీల్‌ చేసుకుంటే ఇదే విషయం తనకు తెలిసిందన్నాడు. దాంతో రైట్‌ ఏరియాలో బంతుల్ని వేయడానికి కృషి చేస్తానన్నాడు. ఈ వికెట్‌పై కొన్ని సందర్బాల్లో ఊహించని టర్న్‌ వస్తుందన్నాడు. రేపు జరగబోయే క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఇది మరో నాకౌట్‌ మ్యాచ్‌ కావడంతో ఇరుజట్లు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సన్‌రైజర్స్‌ చిన్న చిన్న లక్ష్యాలను కాపాడుకుంటూ విజయాలు సాధిస్తూ ఉంటే, ఢిల్లీ పేలవమైన ఫామ్‌తో వరుస ఓటముల్ని చవిచూస్తోంది. సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ విభాగం పటిష్టంగా మారడమే ఆ జట్టు వరుస విజయాలకు ప్రధాన కారణం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement