Ravi Shastri
Ravi Shastri To Step Down As Team India Head Coach: టీమిండియా ప్రధాన కోచ్ పదవి అంటే కత్తి మీద సాములాంటిదని రవిశాస్త్రి అన్నాడు. అభిమానుల అంచనాలు అందుకుంటే అంతా సవ్యంగా సాగుతుందని, లేనిపక్షంలో విమర్శల జడి కురుస్తుందని పేర్కొన్నాడు. జట్టు విజయం తప్ప ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేరని, వరుస పరాజయాల తర్వాత కనీసం ఒక్కసారైనా గెలవకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 2017లో భారత జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడైన రవిశాస్త్రి హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించిన సంగతి తెలిసిందే.
ఇటీవలి ఆస్ట్రేలియా టూర్, ఇంగ్లండ్ ఇండియా పర్యటన, ఇండియా ఇంగ్లండ్ టూర్‌లోనూ కోహ్లి సేన విజయాలు సాధించడం ఇందుకు తాజా నిదర్శనం. ఇక ఇదిలా ఉంటే.. టి20 వరల్డ్‌కప్ తర్వాత తన పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ వరకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ కోరినా, ఆయన అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ‘ది గార్డియన్’కు రవిశాస్త్రి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా బుక్ లాంచ్ చేసిన రవిశాస్త్రికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఇతర కోచ్‌లు ఐసోలేషన్‌కు వెళ్లడం, ఐదో టెస్టుకు ముందు టీమిండియా అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో మ్యాచ్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో రవిశాస్త్రిని ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు.
ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ.. ‘‘మనకు కోవిడ్ సోకిందా లేదా అన్న విషయం గురించి వాళ్ల(అభిమానుల)కు అనవసరం. ఎప్పుడూ జట్టు గెలుపొందడమే వాళ్లకు కావాల్సింది. భారత జట్టుకు కోచ్‌గా ఉండటం అంటే బ్రెజిల్ లేదా ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా ఉన్నట్లే. అంచనాలు ఆ స్థాయిలో ఉంటాయి. ఆరు నెలల పాటు జట్టు మంచి విజయాలు సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఒక్క ఓటమి ఎదురైనా మనల్ని టార్గెట్ చేస్తారు. కాబట్టి మనకు అప్పటికప్పుడు గెలుపు అవసరం. లేదంటే మనల్ని కాల్చుకుతింటారు. ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు వెనుకాడరు. అలాంటి సమయంలో ఇదిగో ఇలా నాలాగా దాక్కోవాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నాడు.
గెలిచే అవకాశాలు ఉన్నాయి.. అయితే అదొక్కటే బాధ!
ఇక అక్టోబరులో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌నకు సన్నద్ధం కావడం గురించి రవిశాస్త్రి చెబుతూ.. ‘‘మా శాయశక్తులా కృషి చేస్తాం. మా స్థాయికి తగ్గట్లు ఆడితే గెలుపు ఖాయం. నిజానికి టెస్ట్ మ్యాచ్ అంటే ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. అదే టీ20 మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తూ ఆడవచ్చు. కప్ గెలిచే విధంగా అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం’’ అని వెల్లడించాడు.
ఇక ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో పనిచేశానని, డ్రెసింగ్ రూంలో మంచి వాతావరణం ఉంటుందన్న రవిశాస్త్రి.. ఈ మెగా టోర్నీ తర్వాత కాస్త బాధపడాల్సి వస్తుందని కోచ్ పదవి నుంచి తప్పుకునే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. కాగా రవిశాస్త్రి స్థానంలో అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: MS Dhoni: జోరు మీదున్న తలైవా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం
Comments
Please login to add a commentAdd a comment