టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపి కెప్టెన్‌గా పేరు సంపాదించిన హార్దిక్ అదే టెంపోను ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీజన్‌లోనూ వరుస విజయాలతో గుజరాత్‌ను పాయింట్ల పట్టికలో మరోసారి టాప్‌లో ఉంచాడు. మరి పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి టైటిల్ కొడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ జట్టుకు దూరమైనప్పుడల్లా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాకు స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ తన సత్తా ఏంటో చాటుతున్నాడు. ముఖ్యంగా టి20 ఫార్మాట్‌లో హార్దిక్ కెప్టెన్సీలో టీమిండియా దూసుకెళ్తోంది.
గతేడాది టి20 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ పరాజయం చెందినప్పటి నుంచి హార్దిక్ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టి20లకు హార్దిక్‌ను రెగ్యులర్ కెప్టెన్ చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
"హార్దిక్ పాండ్యా ఇప్పటికే టి20ల్లో భారత స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఫిట్‌గా ఉన్నంత కాలం అతడే కెప్టెన్‌గా కొనసాగాలి. సెలక్టర్లు కూడా ఇదే విషయం ఆలోచిస్తున్నారనుకుంటా. ప్రస్తుతం యువకుల్లో చాల మంది ప్రతిభావంతులున్నారు. కాబట్టి కొత్త జట్టును తీసుకురావచ్చు. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న యువ ప్రతిభావంతులను చూస్తున్నారు.
కాబట్టి బీసీసీఐ 2007లో అనుసరించిన మార్గంలోనే వెళ్తుందని అనుకుంటున్నా. అప్పుడు కూడా యువకులకు అవకాశం కల్పించారు. పాండ్యా ప్రతిభ కలిగిన ఆటగాడు. అతడి ఐడియాలు విభిన్నంగా ఉంటాయి. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఇతర ఆటగాళ్లను కూడా గమనిస్తున్నాడు.
"అక్టోబరు-నవంబరులో జరగనున్న ఐసీసీ ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో అతడు టెస్టు జట్టులో లేనందుకు అతడిపై ఎలాంటి వర్క్ లోడ్ ఉండదు. ఈ రోజుల్లో ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడట్లేదు. టెస్టు సిరీస్ సమయంలో అతడికి ఓ నెల విశ్రాంతి దొరుకుతుంది" అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment