అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13 సీజన్‌లో ఆర్సీబీ ఆటగాడు దేవదూత్ పడిక్కల్ మరోసారి మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ హాఫ్ సెంచరీ సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 33 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్న పడిక్కల్.. మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది పడిక్కల్‌కు మూడో ఐపీఎల్ హాఫ్ సెంచరీ. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆర్సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడగా పడిక్కల్ మూడు హాఫ్ సెంచరీలు సాధించడం విశేషం. ఇది ఒక రికార్డుగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా పడిక్కల్ రికార్డు సాధించాడు. (చదవండి: ఫస్ట్ బాల్‌కే వికెట్.. ఇది ఔటా?)
తన మ్యాజికల్ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీకి విజయాలు అందిస్తూ ఇప్పుడు ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో పార్థీవ్ పటేల్ స్థానంలో ఓపెనర్‌గా దిగిన పడిక్కల్.. అంచనాలను అందుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ముంబై ఇండియన్స్‌పై గత మ్యాచ్‌లో 54 పరుగులు సాధించిన పడిక్కల్.. కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో 1 పరుగు చేసి విఫలమయ్యాడు. అంతకుముందు ఎస్‌ఆర్‌హెచ్‌పై 56 పరుగులు సాధించాడు పడిక్కల్. ఇప్పుడు రాజస్తాన్‌పై మరో హాఫ్ సెంచరీతో మెరిశాడు. దాంతో పడిక్కల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
గత విజయ్ హజారే ట్రోఫీలో (50 ఓవర్లు), సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీల్లో పడిక్కల్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 20 ఏండ్ల పడిక్కల్ 175.75 స్ట్రయిక్‌రేట్‌తో 580 పరుగులు పిండుకున్నాడు. సగటున ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు ఓ అర్థ సెంచరీ సాధించి వెలుగులోకి వచ్చాడు. దూకుడు, సహనం, సంయమనం, టెక్నిక్, టెంపర్‌మెంట్ కలిగిన పడిక్కల్ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. (చదవండి: మాకే ఎందుకిలా జరుగుతుంది : వార్నర్)
ఆర్సీబీ మరో విక్టరీ..
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దేవదూత్ పడిక్కల్(63; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్), విరాట్ కోహ్లి((72 నాటౌట్; 53 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్ నిర్దేశించిన 155 పరుగుల టార్గెట్‌లో ఆర్సీబీ ఆదిలోనే ఫించ్(8) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో పడిక్కల్-కోహ్లిలు 99 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే పడిక్కల్ హాఫ్ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 124 పరుగుల వద్ద ఉండగా పడిక్కల్ ఔట్ కాగా, ఆపై కోహ్లి-డివిలియర్స్(12 నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్)లు లాంఛనం పూర్తిచేశారు. ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఇది ఆర్సీబీకి మూడో విజయం కాగా, రాజస్తాన్‌కు రెండో ఓటమి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్.. టాపార్డర్ ఆటగాళ్లైన స్టీవ్ స్మిత్(5), జోస్ బట్లర్(22), సంజూ శాంసన్(4) వికెట్లను ఐదు ఓవర్లలోపే కోల్పోయింది. ఇసుర ఉదాన వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి స్మిత్ బౌల్డ్ కాగా, కాసేపటికి సైనీ బౌలింగ్‌లో బట్లర్ పెవిలియన్ చేరాడు. దేవదూత్ పడిక్కల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో బట్లర్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక సంజూ శాంసన్ కూడా విఫలయ్యాడు. దాంతో 31 పరుగులకే రాజస్తాన్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై రాబిన్ ఊతప్ప-లామ్రోర్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కానీ ఊతప్ప(17) నాల్గో వికెట్‌గా ఔట్ కావడంతో రాజస్తాన్‌ను లామ్రోర్ ఆదుకున్నాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా లామ్రోర్ మాత్రం నిలకడగా ఆడాడు. 39 బంతుల్లో 1 ఫోర్, 3సిక్స్‌లతో 47 పరుగులు సాధించి రాజస్తాన్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఇది లామ్రోర్‌కు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్. చివర్లో ఆర్చర్(16 నాటౌట్; 10 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్)), రాహుల్ తెవాటియా(24 నాటౌట్; 12 బంతుల్లో 3 సిక్స్‌లు)లు ఫర్వాలేదనిపించడంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్ మూడు వికెట్లు సాధించగా, ఉదాన రెండు వికెట్లు తీశాడు. సైనీకి వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment