అబుదాబి: రాయల్స్ చాలెంజర్స్-ఢిల్లీ క్యాపిటల్స్‌లో అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఇది టైటిల్ పోరు కాకపోయినా వీరిమధ్య జరిగే తాజా మ్యాచ్ అంతకంటే తక్కువ కాదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఇక్కడ ఓడిన జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నా చివరికి ఏ పరిస్థితి వస్తుందో చెప్పలేం. దాంతో ఇరుజట్లు తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 196 పరుగులు చేయగా, ఆర్సీబీ 137 పరుగులకే పరిమితమైంది. ఓవరాల్‌గా ఇరుజట్ల మధ్య 24 మ్యాచ్‌లు జరగ్గా అందులో ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఢిల్లీ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక‍్కడ ఢిల్లీని వరుస ఓటములు కలవర పరుస్తున్నాయి. ఢిల్లీ ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని మాత్రమే ఢిల్లీ సాధించింది. తొలి అంచెలో ఆకట్టుకున్న ఢిల్లీ, రెండో అంచె వచ్చేసరికి చతికిలబడింది. ప్రధానంగా టాపార్డర్ వైఫల్యంతో ఆ జట్టు భారీ స్కోర్లు చేయలేకపోతోంది. ఇక ఆర్సీబీ గత ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించింది. కాగా, వరుసగా మూడు పరాజయాలు రావడం కూడా ఆర్సీబీ శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తోంది.
ఢిల్లీ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో శిఖర్ ధావన్(471), శ్రేయస్ అయ్యర్(414), రిషభ్ పంత్(274)లు టాప్ ఫెర్ఫార్మెర్స్‌గా ఉండగా, ఆ జట్టు అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో రబడా(23), నోర్జే(16), రవిచంద్రన్ అశ్విన్((9)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక ఆర్సీబీ జట్టులో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లి(431), దేవదూత్ పడిక్కల్(422), ఏబీ డివిలియర్స్(363)లు వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో యజ్వేంద్ర చహల్(20), క్రిస్ మోరిస్(11), మహ్మద్ సిరాజ్(8)లు టాప్ ఫెర్ఫార్లగా ఉన్నారు.
ప్రస్తుతం వీరిద్దరి మధ్య రెండో అంచె మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. గత మ్యాచ్ ఫలితాన్ని రిపీట్ చేయాలని ఢిల్లీ భావిస్తుండగా, ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లి గ్యాంగ్ చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరడమే కాకుండా టాప్-2కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా, ఇప్పటికే అగ్రస్థానాన్ని ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో పదిలం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment