బుమ్రా- షమీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అభిమానులకు చేదువార్త చెప్పాడు. టెస్టు సిరీస్ కోసం తాను సౌతాఫ్రికా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూనే ట్విస్ట్ ఇచ్చాడు. తన మోకాలి నొప్పి కోసం చికిత్స తీసుకుంటున్నానని.. కాస్త ఊరట లభించినా కచ్చితంగా జట్టుతో కలుస్తానని తెలిపాడు. లేనిపక్షంలో తాను సౌతాఫ్రికాకు వెళ్లడం కష్టమేనని పరోక్షంగా వెల్లడించాడు.
కాగా వన్డే ప్రపంచకప్-2023లో లేట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ టోర్నీలో ఏకంగా మూడుసార్లు ఐదు వికెట్ల హాల్ నమోదు చేసి సరికొత్త సృష్టించాడు. అంతేకాదు.. మొత్తంగా 24 వికెట్లు కూల్చి .. ప్రపంచకప్-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఈ క్రమంలో వరల్డ్‌కప్ అనంతరం మోకాలి నొప్పి కారణంగా విశ్రాంతి తీసుకున్న ఈ యూపీ బౌలర్.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20, సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. అయితే, ప్రొటిస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో మాత్రం షమీ పేరును చేర్చింది బీసీసీఐ. అతడు గాయం నుంచి కోలుకుంటే సౌతాఫ్రికా విమానం ఎక్కుతాడని సంకేతాలు ఇచ్చింది.
కాగా డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా- టీమిండియా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ తాజాగా స్పోర్ట్స్ తక్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
‘‘నొప్పి నుంచి ఉపశమనం లభిస్తే సౌతాఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. చాలా కాలంగా మోకాలి నొప్పి వేధిస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నా. అయినప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్నా.
ఒకవేళ ఈ నొప్పి గనుక తగ్గితే నేను సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడటానికి కచ్చితంగా అందుబాటులో ఉంటాను. లేదంటే అంతే ఇక’’ అని షమీ పేర్కొన్నాడు. కాగా భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పటికే టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికాకు బయల్దేరాడు.
Comments
Please login to add a commentAdd a comment