చరిత్రకెక్కిన విజయంతో సఫారీ టూర్‌ ముగింపు | Safari Tour ends with a historic success | Sakshi
Sakshi News home page

చరిత్రకెక్కిన విజయంతో సఫారీ టూర్‌ ముగింపు

Published Fri, Jan 5 2024 3:29 AM | Last Updated on Fri, Jan 5 2024 10:26 AM

Safari Tour ends with a historic success - Sakshi

తగ్గేదేలే... సినిమా డైలాగ్‌లా ఉంది సఫారీలో భారత పర్యటన తీరు! తొలి టెస్టును ఆతిథ్య జట్టు మూడు రోజుల్లోనే ముగిస్తే... రెండో టెస్టును టీమిండియా రెండు రోజుల్లోనే ఖతం చేసింది. మొదటి మ్యాచ్‌ ముగియగానే అందరూ ‘భారత్‌ సొంతగడ్డపై పులి... విదేశాల్లో పిల్లి’ అని నిట్టూర్చారు.

ఇప్పుడదే విమర్శకులు ‘ఔరా’ అని విస్తుపోయేలా మన పేస్‌ పేట్రేగిపోయింది. అచ్చిరాని కేప్‌టౌన్‌లో కేక పెట్టింది. క్రీజులోకి దిగిన బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపింది. ఇన్నేళ్లుగా ఏ వేదికపై గెలవలేకపోయామో అక్కడే చరిత్రకెక్కే గెలుపుతో భారత్‌ మళ్లీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.   

కేప్‌టౌన్‌: క్రికెట్‌నే శ్వాసించే భారత అభిమానులకు ఈ కొత్త సంవత్సరం కిక్‌ ఇచ్చే గిఫ్ట్‌ను టీమిండియా ఇచ్చింది. ఆఖరి రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. మొత్తం సఫారీ పర్యటనలో మూడు ఫార్మాట్‌ల సిరీస్‌ను సాధికారంగా ముగించింది.

గత డిసెంబర్‌లో టి20 సిరీస్‌తో ఈ పర్యటన మొదలైంది. టి20 సిరీస్‌ను 1–1తో సమం చేసుకున్న టీమిండియా... వన్డే సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. తాజాగా టెస్టు సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. తద్వారా ఏ ఒక్క సిరీస్‌లోనూ తగ్గలేదు సరికదా... పైపెచ్చు వన్డేలతో ఒకమెట్టుపైనే నిలిచింది.  

అలా మొదలై... ఇలా కుదేలైంది! 
తొలిరోజే 23 వికెట్లతో ఆసక్తికర పేస్‌ డ్రామాకు తెరలేపిన మ్యాచ్‌... రెండో రోజు అదే పేస్‌ పదునుకు తెరపడేలా చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 62/3తో గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది.

ఇంత తక్కువ జట్టు స్కోరులోనూ మార్క్‌రమ్‌ (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ హైలైట్‌ కాగా... తొలి ఇన్నింగ్స్‌ను సిరాజ్‌ కూల్చితే... రెండో ఇన్నింగ్స్‌లో ఆ పని బుమ్రా (6/61) చేశాడు. 98 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం వల్ల భారత్‌ లక్ష్యం 79 పరుగులతో మరింత చిన్నదైంది. దీన్ని టీమిండియా 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులతో చకచకా ఛేదించింది. 

ఒకడి పోరాటం... మరొకడి పేస్‌ ప్రతాపం 
టెస్టుల్లో ఆటంటే ఐదు రోజులు. నాలుగు ఇన్నింగ్స్‌లు... 15 సెషన్లు...  450 ఓవర్లు... 40 వికెట్లు... అంటే అందదూ (బ్యాటింగ్‌) డబుల్‌ యాక్షన్‌ చేయాల్సిందే!  అన్ని రోజులు శ్రమించినా... ప్రతి సెషన్లోనూ చెమటోడ్చినా చాలా టెస్టుల్లో (డ్రాలతో) ఫలితమే రాదు! కేప్‌టౌన్‌లో మాత్రం పేస్‌ పదునుకు, భారత్‌ పట్టుదలకు ఒక వంతు (ఐదు సెషన్లలోపే)లోనే, రెండు రోజులు పూర్తవకముందే భారత్‌ జయభేరి మోగించింది.

తొలి సెషన్లో దక్షిణాఫ్రికా ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ మార్క్‌రమ్‌ వన్డేను తలపించే ఆటతీరుతో చకచకా పరుగులు సాధించాడు. మరోవైపు బుమ్రా... బెడింగ్‌హమ్‌ (11), కైల్‌ వెరిన్‌ (9)లను పడగొట్టడంలో సఫలమయ్యాడు. దీని వల్ల జట్టు స్కోరు వంద పరుగుల్లోపే సగం (85/5) వికెట్లను కోల్పోగా, మార్క్‌రమ్‌ ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. పిచ్‌ సంగతి, బుమ్రా పేస్‌ నిప్పులు వెంటనే అర్థమైపోవడంతో మార్క్‌రమ్‌ ధనాధన్‌ బౌండరీలతో సెంచరీ సాధించాడు.

కానీ ఈలోపే బుమ్రా కూడా జాన్సెన్‌ (11), కేశవ్‌ మహరాజ్‌ (3) వికెట్లను చేజిక్కించుకున్నాడు. మార్క్‌రమ్‌ పోరాటానికి సిరాజ్‌ బౌలింగ్‌లో చుక్కెదురవగా... మిగతా టెయిలెండర్లు లంచ్‌లోపే అవుటయ్యారు. ఇక రెండో సెషన్‌లో లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులోకి దిగిన వారంతా వేగంగా బ్యాటింగ్‌ చేశారు.

యశస్వి జైస్వాల్‌ (23 బంతుల్లో 28; 6 ఫోర్లు), గిల్‌ (11 బంతుల్లో 10; 2 ఫోర్లు), కోహ్లి (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) అవుట్‌కాగా, కెపె్టన్‌ రోహిత్‌ (16 నాటౌట్‌; 2 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (4 నాటౌట్‌; 1 ఫోర్‌) అజేయంగా ముగించారు. సిరాజ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌’ అవార్డు లభించగా... ‘ప్లేయర్‌ అఫ్‌ ద సిరీస్‌’ పురస్కారాన్ని ఎల్గర్, బుమ్రా సంయుక్తంగా గెల్చుకున్నారు.   

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 55 ఆలౌట్‌; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 153 ఆలౌట్‌; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) సిరాజ్‌ 106; ఎల్గర్‌ (సి) కోహ్లి (బి) ముకేశ్‌ 12; జోర్జి (సి) రాహుల్‌ (బి) ముకేశ్‌ 1; స్టబ్స్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 1; బెడింగమ్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 11; వెరిన్‌ (సి) సిరాజ్‌ (బి) బుమ్రా 9; జాన్సెన్‌ (సి అండ్‌ బి) బుమ్రా 11; కేశవ్‌ మహరాజ్‌ (సి) అయ్యర్‌ (బి) బుమ్రా 3; రబడ (సి) రోహిత్‌ శర్మ (బి) ప్రసిధ్‌ కృష్ణ 2; బర్గర్‌ (నాటౌట్‌) 6; ఎన్‌గిడి (సి) యశస్వి (బి) బుమ్రా 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (36.5 ఓవర్లలో ఆలౌట్‌) 176.  వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45, 4–66, 5–85, 6–103, 7–111, 8–162, 9–162, 10–176. బౌలింగ్‌: బుమ్రా 13.5–0–61–6, సిరాజ్‌ 9–3–31–1, ముకేశ్‌ కుమార్‌ 10–2–56–2, ప్రసిధ్‌ కృష్ణ 4–1–27–1. 
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) స్టబ్స్‌ (బి) బర్గర్‌ 28; రోహిత్‌ శర్మ (నాటౌట్‌) 16; శుబ్‌మన్‌ గిల్‌ (బి) రబడ 10; కోహ్లి (సి) వెరిన్‌ (బి) జాన్సెన్‌ 12; శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (12 ఓవర్లలో మూడు వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–44, 2–57, 3–75. బౌలింగ్‌: రబడ 6–0–33–1, బర్గర్‌ 4–0–29–1, జాన్సెన్‌ 2–0–15–1. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement