Ind vs SA: సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు: భారత తొలి క్రికెటర్‌గా బుమ్రా రికార్డు | Ind Vs SA 2nd Test: Bumrah, Siraj, And Rohit Sharma Scripts History, Check Records Details Inside - Sakshi
Sakshi News home page

Ind vs SA: సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు.. భారత తొలి క్రికెటర్‌గా బుమ్రా రికార్డు

Published Fri, Jan 5 2024 10:43 AM | Last Updated on Fri, Jan 5 2024 12:57 PM

Ind vs SA 2nd Test: Bumrah Siraj Rohit Sharma Scripts History Check Records - Sakshi

Ind Vs SA 2nd Test- Records List: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో సంచలన విజయంతో కొత్త ఏడాదిని ప్రారంభించింది టీమిండియా. అంతేకాదు కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్‌ గెలిచిన ఆసియా తొలి జట్టుగానూ చరిత్ర సృష్టించింది. సెంచూరియన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య జట్టు మూడు రోజుల్లో ముగిస్తే.. పర్యాటక భారత జట్టు రెండో టెస్టును ఒకటిన్నర రోజుల్లోనే పూర్తి చేసింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరకపోయినా.. 1-1తో డ్రాగా ముగించి సౌతాఫ్రికాతో ట్రోఫీని పంచుకుంది.

తొలి భారతీయ క్రికెటర్‌గా బుమ్రా
ఈ నేపథ్యంలో కేప్‌టౌన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సౌతాఫ్రికా స్టార్‌ డీన్‌ ఎల్గర్‌తో కలిసి జస్‌ప్రీత్‌ బుమ్రా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. 

తద్వారా.. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు గెల్చుకున్న తొలి భారతీయ  క్రికెటర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. సఫారీ గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌కు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా తొలి టెస్టులో బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. రెండో టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చాడు.

సఫారీ గడ్డపై బుమ్రా- సిరాజ్‌ జోడీ చరిత్ర.. 
ఇక పేసర్ల అద్భుత బౌలింగ్‌ కారణంగానే టీమిండియా కేప్‌టౌన్‌లో విజయఢంకా మోగించిందన్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ సిరాజ్‌ ఆరు వికెట్లతో చెలరేగి 55 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించగా.. రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్‌ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రొటిస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

ఈ నేపథ్యంలో సిరాజ్‌, బుమ్రా సౌతాఫ్రికాలో అరుదైన రికార్డు సృష్టించారు. సఫారీ గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో ఇద్దరు భారత పేస్‌ బౌలర్లు (సిరాజ్, బుమ్రా) రెండు ఇన్నింగ్స్‌లలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అదే విధంగా.. టీమిండియా తరఫున టెస్టుల్లో ఓవరాల్‌గా రెండోసారి మాత్రమే. 2014లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో భువనేశ్వర్‌ కుమార్‌ (తొలి ఇన్నింగ్స్‌లో 6/82), ఇషాంత్‌ శర్మ (రెండో ఇన్నింగ్స్‌లో 7/74) తొలిసారి ఈ ఘనత సాధించారు. 

సౌతాఫ్రికాపై టీమిండియా విజయం నేపథ్యంలో నమోదైన మరిన్ని రికార్డులు ఇవే
642: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టులో ఫలితం రావడానికి వచ్చిన బంతులు (107 ఓవర్లు). తక్కువ బంతుల పరంగా, ఓవర్ల పరంగా టెస్టు క్రికెట్‌లో ఫలితం వచ్చిన టెస్టుగా ఈ మ్యాచ్‌ రికార్డు పుస్తకాల్లో ఎక్కింది. 1932లో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్ట్‌లో 656 బంతుల్లో ఫలితం వచ్చింది.

ఇది మూడోసారి మాత్రమే
3: రెండు రోజుల్లోనే ముగిసిన టెస్టులో భారత జట్టు నెగ్గడం ఇది మూడోసారి. గతంలో భారత జట్టు అఫ్గానిస్తాన్‌పై (బెంగళూరులో–2018), ఇంగ్లండ్‌పై (అహ్మదాబాద్‌లో–2021) ఈ ఘనత సాధించింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 25 టెస్టుల్లో రెండు రోజుల్లోనే ఫలితం వచ్చింది. 

1: కేప్‌టౌన్‌లో భారత జట్టు టెస్టులో నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో ఈ వేదికపై భారత్‌ ఆరు టెస్టులు ఆడి రెండింటిని ‘డ్రా’ చేసుకొని, నాలుగింటిలో ఓడింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు రెండోసారి బ్యాటింగ్‌ చేసి టెస్టులో గెలవడం ఇదే మొదటిసారి. గతంలో ఇక్కడ భారత్‌ నెగ్గిన నాలుగు టెస్టుల్లో తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించింది.  

5: దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు గెలిచిన టెస్టుల సంఖ్య (జోహనెస్‌బర్గ్‌లో–2, డర్బన్‌లో–1, సెంచూరియన్‌లో–1, కేప్‌టౌన్‌లో–1). దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ మొత్తం 25 టెస్టుల ఆడగా ... ఐదు టెస్టుల్లో విజయం సాధించింది. 13 టెస్టుల్లో ఓడిపోయింది. ఏడింటిని ‘డ్రా’ చేసుకుంది. 

నాలుగో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ
4: రాహుల్‌ ద్రవిడ్‌ (2006), ధోని (2010), కోహ్లి (2018, 2021) తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టుకు టెస్టులో విజయాన్ని అందించిన నాలుగో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ గుర్తింపు పొందాడు. 

2: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ను ‘డ్రా’గా ముగించడం భారత జట్టుకిది రెండోసారి. ధోని సారథ్యంలో 2010–2011లో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1–1తో సమంగా ముగించింది. ఇప్పుడు రోహిత్‌ శర్మ  కెప్టెన్సీలో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1–1తో ‘డ్రా’గా ముగించింది. 

4: కేప్‌టౌన్‌లో రెండు రోజుల్లోనే ఫలితం వచ్చిన టెస్టులు. 1889, 1896లో దక్షిణాఫ్రికా–ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండు టెస్టులు... 2005లో దక్షిణాఫ్రికా–జింబాబ్వే జట్ల మధ్య ఒక టెస్టు రెండు రోజుల్లోనే ముగిశాయి.

చదవండి:  కంగ్రాట్స్‌ టీమిండియా.. అతడు మాత్రం భయపెట్టాడు! బుమ్రా కూడా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement