అన్‌స్టాపబుల్‌ సిరాజ్‌: అద్భుత ప్రదర్శన.. టెస్టుల్లో ఇదే తొలిసారి | Ind vs SA 2nd Test Day 1: Unstoppable Siraj 1st 6 Wicket Haul, SA All Out For 55 | Sakshi
Sakshi News home page

Ind vs SA: అన్‌స్టాపబుల్‌ సిరాజ్‌: అద్భుత ప్రదర్శన.. టెస్టుల్లో ఇదే తొలిసారి! వీడియో

Published Wed, Jan 3 2024 3:50 PM | Last Updated on Wed, Jan 3 2024 4:40 PM

Ind vs SA 2nd Test Day 1: Unstoppable Siraj 1st 6 Wicket Haul SA All Out For 55 - Sakshi

South Africa vs India, 2nd Test: కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ దుమ్ములేపాడు. ఆరంభంలోనే ప్రొటిస్‌ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. తొలుత ఐడెన్‌ మార్క్రమ్‌(2)ను అవుట్‌ చేసిన ఈ హైదరాబాదీ స్పీడ్‌స్టర్‌.. అనంతరం కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ రూపంలో బిగ్‌ వికెట్‌ పడగొట్టాడు.

కీలక వికెట్‌ కూల్చి.. పతనానికి నాంది పలికి
గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అద్భుత రీతిలో ఎల్గర్‌ను బౌల్డ్‌ చేశాడు. అవుట్‌సైడ్‌ ఆఫ్‌ దిశగా సిరాజ్‌ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన ఎల్గర్‌(4) షాట్‌ ఆడేందుకు విఫలయత్నం చేసి వికెట్‌ పారేసుకున్నాడు. తాను అవుటైన తీరును నమ్మలేక నిరాశగా మైదానాన్ని వీడాడు.

కాగా గత మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో రాణించిన డీన్‌ ఎల్గర్‌ సౌతాఫ్రికాకు భారీ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో తెంబా బవుమా స్థానంలో.. అది కూడా తన కెరీర్‌లో ఆడుతున్న ఆఖరి టెస్టులో కెప్టెన్‌గా బరిలోకి దిగిన అతడిని సిరాజ్‌ ఇలా కోలుకోలేని దెబ్బకొట్టాడు.

సిరాజ్‌ దెబ్బకు టాపార్డర్‌ కకావికలం
దీంతో ఆరంభంలోనే సౌతాఫ్రికా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జస్‌ప్రీత్‌ బుమ్రా ట్రిస్టన్‌ స్టబ్స్‌ను 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్‌ చేయగా.. టోనీ డీ జోర్జీ(2) రూపంలో సిరాజ్‌ మళ్లీ తన వికెట్ల ఖాతా తిరిగి తెరిచాడు.

ఈ రైటార్మ్‌ పేసర్‌ దెబ్బకు సౌతాఫ్రికా టాపార్డర్‌ మొత్తం కలిపి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక జోర్జీ వికెట్‌ తీసుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన సిరాజ్‌.. 15.2 ఓవర్‌ వద్ద డేవిడ్‌ బెడింగ్‌హాం(12), అదే ఓవర్లో ఐదో బంతికి మార్కో జాన్సెన్‌(0) వికెట్లు కూడా పడగొట్టాడు. తద్వారా కేప్‌టౌన్‌ టెస్టులో ఐదు వికెట్‌ హాల్‌ నమోదు చేశాడు.

టెస్టుల్లో తొలి 6 వికెట్‌ హాల్‌
అంతటితో సిరాజ్‌ విధ్వంసం ఆగిపోలేదు. 17.5 ఓవర్‌ వద్ద వెరెనె(15) రూపంలో ఆరో వికెట్‌ దక్కించుకున్నాడు ఈ ఫాస్ట్‌బౌలర్‌. తద్వారా టెస్టుల్లో టీమిండియా తరఫున తన మొదటి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటికే ఆసియా కప్‌-2023 ఫైనల్‌ సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసి వన్డేల్లో ఈ ఘనత సాధించాడు.

55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా
ఇక సిరాజ్‌ తర్వాత వికెట్లు పడగొట్టే బాధ్యత తీసుకున్న ముకేశ్‌ కుమార్‌ కేశవ్‌ మహరాజ్‌(3)ను అవుట్‌ చేయగా.. బుమ్రా.. నండ్రీ బర్గర్‌(4)ను పెవిలియన్‌కు పంపాడు. ఇక 23.2 ఓవర్‌ వద్ద కగిసో రబడ(5)ను పెవిలియన్‌కు పంపి ముకేశ్‌ కుమార్‌ సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.

ఇలా భారత పేసర్ల ధాటికి సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్‌పై సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చదవండి: T20 WC 2024: రోహిత్‌, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ కీలక నిర్ణయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement