జ‌స్పాల్ రాణా మృతి వెనుక అసలు కారణమిదే! | Reasons-Here What Led To Former India Shooter Jaspal Ranas Death | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ దిగ్గ‌జం జ‌స్పాల్ రాణా మృతి వెనుక అసలు కారణమిదే!

Jun 12 2026 6:57 PM | Updated on Jun 12 2026 8:00 PM

Reasons-Here What Led To Former India Shooter Jaspal Ranas Death

భార‌త దిగ్గ‌జ షూట‌ర్‌, కోచ్ జ‌స్పాల్ రాణా శుక్ర‌వారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురైన జ‌స్పాల్ రాణా న్యూఢిల్లీలోని మ్యాక్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కాగా గురువారం రాత్రి వ‌ర‌కు ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు చెప్ప‌డం, మ‌రునాడే ఆయ‌న పరిస్థితి విష‌మించి ప్రాణాలు విడ‌వ‌డం ప‌లు అనుమానాల‌కు తావిచ్చింది. 

మ‌రి జ‌స్పాల్ రాణా ఆక‌స్మిక మృతి వెనుక కార‌ణం ఏమై ఉంటుంద‌నేది కార్డియాక్ సైన్సెస్ గ్రూప్ చైర్మ‌న్ డాక్ట‌ర్ బ‌ల్బీర్‌సింగ్ వివ‌రించారు. 'జ‌స్పాల్ రాణా మూడు రోజుల క్రితం తీవ్ర‌మైన గుండెపోటుతో ఆసుప‌త్రిలో జాయిన‌య్యారు. అయితే విమాన ప్ర‌యాణంలో ఉండ‌గానే ఛాతిలో నొప్పి వ‌చ్చింది. అత్యంత విష‌మ ప‌రిస్థితిలో ఆయ‌న ఆసుప‌త్రికి చేరుకున్నారు. అప్ప‌టికే జ‌స్పాల్ గుండెలో ర‌క్త ప్ర‌సర‌ణ జ‌రిగే ధ‌మ‌ని పూర్తిగా మూసుకుపోయింది. దీనివల్ల అత‌డి గుండె పంపింగ్ సామ‌ర్థ్యం పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డిపోయింది. 

ఆయ‌న కోలుకున్న‌ట్లే క‌నిపించిన‌ప్ప‌టికీ ధ‌మ‌ని మూసుకుక‌పోవ‌డం వ‌ల్ల హార్ట్ ఫెయిలయ్యింది. గుండెపోటు త‌ర్వాత  కూడా కొంత‌మందికి మైల్డ్‌, మ‌రికొంత‌మందికి తీవ్రమైన హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది. అయితే జ‌స్పాల్ రాణా గుండె పరిస్థితి మొద‌ట సాధార‌ణ స్థితికి రావ‌డంతో ఆయ‌న కోలుకున్న‌ట్లే క‌నిపించారు. డాక్ట‌ర్లు కూడా శుక్ర‌వారం ఆయ‌న్ను ప‌రీక్షించి డిశ్చార్జ్ చేయాల‌ని భావించారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ శుక్ర‌వారం ఉద‌యం నిద్ర‌లో ఉండ‌గానే మ‌రోసారి గుండెపోటు రావ‌డంతో జస్పాల్‌ మ‌ర‌ణించారు.' అని చెప్పుకొచ్చారు.

జస్పాల్ రాణా కేవలం కోచ్‌గానే కాకుండా,  స్టార్ పిస్టల్ షూటర్‌గా ఎన్నో పతకాలను కొల్లగొట్టి దేశాన్ని గర్వపడేలా చేశాడు. 1990ల కాలంలో భారత షూటింగ్‌లో ఆయన తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు అందించారు. ముఖ్యంగా 2006 దోహా ఆసియా క్రీడల్లో ప్రపంచ రికార్డును సమం చేస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకంగా 9 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 15 పతకాలను కొల్లగొట్టారు. 

దీంతో ఆయనకు చిన్న వయస్సులోనే అర్జున అవార్డు దక్కింది. షూటింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక, దేశంలో అత్యుత్తమ షూటర్లను తయారుచేసే పనిలో జస్పాల్ నిమగ్నమయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను భాకర్‌కు ఈయనే వ్యక్తిగత కోచ్. సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా వంటి అద్భుతమైన షూటర్లను తీర్చిదిద్దినందుకు గానూ 2020లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 'ద్రోణాచార్య' అవార్డుతో సత్కరించింది. జస్పాల్ ప్రస్తుతం భారత పిస్టల్ షూటింగ్ విభాగానికి హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఉన్నారు.

చదవండి: అతడిని విస్మరించొద్దు.. సెలెక్టర్లకు మాజీ క్రికెటర్‌ హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement