న్యూఢిల్లీ: కనీసం ఈ ఐపీఎల్ సీజన్‌లోనైనా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ నుంచే నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ పరాజయం చెందడంతో టోర్నీ నుంచి వైదొలిగింది. దాంతో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శల తాకిడి ఎక్కువైంది. అసలు ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లి సరైన వ్యక్తేనా అనే ప్రశ్న తలెత్తింది. ఎనిమిదేళ్ల నుంచి కెప్టెన్‌గా చేస్తున్న కోహ్లి.. ఆ జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించి పెట్టలేకపోయాడని మాజీలు విమర్శిస్తున్నారు. జట్టు వరుసగా పరాజయాలు చవిచూస్తున్నప్పుడు దానికి కెప్టెనే బాధ్యత తీసుకోవాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎద్దేవా చేశాడు. కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ఇదే సరైన సమయమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. (ఢిల్లీపై అదే మా ప్రణాళిక: రషీద్ ఖాన్)
కాగా, గంభీర్ అభిప్రాయంతో మరో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విభేదించాడు. కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడం మార్గం కాదన్నాడు. ‘ కోహ్లిని కెప్టెన్‌గా మార్చాల్సిన అవసరం లేదు. అతని జట్టుకు సారథిగా మాత్రమే ఉన్నాడు. ఇక్కడ ఫలితాలు రాకపోవడానికి ఆర్సీబీ పూర్తిస్థాయి జట్టుతో ఏనాడు సిద్ధం కాలేదు. టీమిండియాకు కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. మరి ఇక్కడ ఫలితాలు సాధిస్తున్నాడు కదా. వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా అన్నింటిలోనే కోహ్లి నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు మెరుగైన విజయాలు నమోదు చేస్తుంది. మరి ఆర్సీబీ ఎందుకు సాధించడం లేదంటే ఓవరాల్‌గా ఆ జట్టే బాలేదు. ప్రతీజట్టు సమతుల్యమైన బ్యాటింగ్ ఆర్డర్ కల్గి ఉంది. ఆర్సీబీలో ఇప్పటివరకూ మంచి బ్యాటింగ్ లైనప్ కన్పించలేదు. ఇప్పుడు ఆర్సీబీలో కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లు మాత్రమే ఉన్నారు. దాంతో వీరి స్థానాలను మార్చుకుంటూ కింది వరుసలో ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేశారు. కానీ అలా ఎప్పుడూ సాధ్యం కాదు. ఆర్సీబీకి ఒక స్పెషలిస్టు ఓపెనర్ కావాలి. అదే సమయంలో లోయర్ ఆర్డర్‌లో ఒక మంచి బ్యాట్స్‌మన్ ఉండాలి. కనీసం ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు ఆ జట్టులో ఉంటే ఆర్సీబీ విజయాలు సాధిస్తుంది. ఇక భారత ఫాస్ట్ బౌలర్లపై కూడా ఆర్సీబీ నమ్మకం ఉంచాలి’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.(కోహ్లి ట్రిక్ వర్కౌట్ కాలేదు..రిప్లై అదిరింది!)
Comments
Please login to add a commentAdd a comment