ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్ కైలియన్ ఎంబాపె ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్‌జీ క్లబ్‌కు) ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబాపె కాంట్రాక్ట్ ఈ సీజన్ అనంతరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎంబాపె ఏ క్లబ్‌లో చేరనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక సౌదీ క్లబ్ అల్ హిలాల్ ఎంబాపెకు ఏడాది కాంట్రాక్ట్ కోసం భారీగా ఆఫర్ చేసింది. అతనికి ఏకంగా 33.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.2700 కోట్లు) చెల్లించడానికి ముందుకు వచ్చింది.
ఈ డీల్ ఫైనల్ చేయడానికి అల్ హిలాల్ అధికారులు మంగళవారం పారిస్కు వెళ్లారు. అయితే ఎంబాపె మాత్రం సంతకం కాదు కదా.. కనీసం వాళ్లను కలవడానికి కూడా ఇష్టపడలేదు. తనకు అల్ హిలాల్ క్లబ్లో చేరే ఆసక్తి లేదని తేల్చిచెప్పాడు. వాస్తవానికి పీఎస్‌జీతో ఒప్పందం ముగిసిన తర్వాత ఎంబాపె కొంతకాలం ఫ్రీగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కొంతకాలం గ్యాప్ తర్వాత ఎంబాపె రియల్ మాడ్రిడ్ క్లబ్‌లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఫ్రీ ట్రాన్స్‌ఫర్ లో అతడు రియల్ మాడ్రిడ్ టీమ్ లోకి వెళ్తే 10 కోట్ల యూరోలు (సుమారు రూ.900 కోట్లు) సైనింగ్ ఆన్ ఫీగా లభిస్తాయి. ఒకవేళ పీఎస్‌జీతోనే కొనసాగాలని భావిస్తే సెప్టెంబర్ లో అతనికి బోనస్ గా 8 కోట్ల యూరోలు (సుమారు రూ.727 కోట్లు) వస్తాయి.
మొదట ఎంబాపెను వదులుకోవడానికి ఇష్టపడని పీఎస్‌జీ క్లబ్ పదేళ్ల కాలానికి గానూ దాదాపు రూ.10వేల కోట్లు ఆఫర్ చేసింది. కానీ ఎంబాపె ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో పీఎస్‌జీ ఎంబాపెను ఇప్పుడే వదిలేసుకొని అతనిపై కాస్త డబ్బు సంపాదించాలని చూస్తోంది. ఏడాది కాలంలో కాంట్రాక్ట్ ముగిసన తర్వాత ఫ్రీగా వదిలేయడం కంటే.. ఇదే బెటరని ఆ క్లబ్ భావిస్తోంది. ట్రాన్స్‌ఫర్ ఫీజుపై ప్రస్తుతానికి పీఎస్‌జీ, అల్ హిలాల్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు.
నిజానికి అల్ హిలాల్ టీమ్ గతంలో లియోనెల్ మెస్సీ కోసం గట్టిగానే ప్రయత్నించింది. కానీ ఇంటర్ మియామీ క్లబ్ రికార్డు ధరకు మెస్సీని కొనుగోలు చేసింది. దీంతో పీఎస్‌జీ తరపునే ఆడుతున్న ఫ్రాన్స్ స్టార్ ఎంబాపెను అయినా దక్కించుకోవాలని ఆరాటపడింది. కానీ తాజాగా ఎంబాపె ఆఫర్‌ను తిరస్కరించడంతో అల్ హిలాల్ క్లబ్‌కు నిరాశే మిగిలింది.
ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 2018లో ఫ్రాన్స్ ఫిపా వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఎంబాపె ఫైనల్లో మెస్సీ సేనకు చెమటలు పట్టించాడు. ఓటమిని అంత సులువుగా ఒప్పుకోని ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అయితే పెనాల్టీ షూటౌట్‌లో ఎంబాపె మినహా మిగతా ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అయితే ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
చదవండి: #KylianMbappe: 'పదేళ్ల కాలానికి తొమ్మిది వేల కోట్లు చెల్లిస్తాం'.. ఎంబాపె తిరస్కరణ
Comments
Please login to add a commentAdd a comment