PC : BCCI
అంతర్జాతీయ జట్లకు కోచ్‌గా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా లేనని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెట్ రిక్కీ పాంటింగ్ పునురద్ఘాటించాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కోచ్ రేసులో తాను ఉన్నానంటూ వస్తున్న వార్తలను ఖండించాడు. ప్రస్తుతం తాను ఎంతో బిజీగా ఉన్నానన్న పాంటింగ్.. ఒకవేళ ఇంగ్లండ్ బోర్డు తన పేరును పరిశీలిస్తున్నట్లయితే ఆ ఆలోచన మానుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
కాగా ఆస్ట్రేలియాకు రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీలు అందించిన రిక్కీ పాంటింగ్.. లెజెండరీ బ్యాటర్‌గా పేరొందాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్ జట్ల కోచ్‌గా మారిన అతడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు మార్గదర్శనం చేశాడు. అయితే, ఐపీఎల్-2024లో దారుణ వైఫల్యాల నేపథ్యంలో ఢిల్లీ పాంటింగ్‌తో బంధాన్ని తెంచుకుంది.
మరోవైపు.. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో నిరాశజనక ప్రదర్శన నేపథ్యంలో ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మ్యాట్ తన పదవి నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో ఆ స్థానాన్ని రిక్కీ పాంటింగ్ భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ఐసీసీ రివ్యూ పాడ్‌కాస్ట్‌లో స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో మాట్లాడిన రిక్కీ పాంటింగ్.. ఇంగ్లండ్ కోచ్‌గా వెళ్లాలన్న ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశాడు.
బిజీగా ఉన్నా
‘‘అంతర్జాతీయ స్థాయి కోచ్ పదవి చేపట్టేందుకు నేను సుముఖంగా లేనని అధికారికంగా తెలియజేస్తున్నా. నా కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నా. అంతేకాదు.. కామెంటేటర్‌గానూ కొనసాగుతున్నాను.. కాబట్టి ఇప్పటికే బిజీ షెడ్యూల్ ఉంది.
వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమంగా ఆస్వాదించాలనుకుంటున్నా. అందుకే రిస్కీ జాబ్స్ చేయదలచుకోలేదు. ముఖ్యంగా.. ఇంగ్లండ్ జట్టుకు ఓ ఆస్ట్రేలియన్ కోచ్‌గా ఉండటమనేది కాస్త భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ పక్కనపెడితే.. కామెంటేటర్‌గా నేను త్వరలోనే యూకేకు వెళ్లాల్సి ఉంది.
ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇస్తా
ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య సిరీస్‌కు వ్యాఖ్యానం చేయబోతున్నాను’’ అని రిక్కీ పాంటింగ్ తెలిపాడు. అంతేకాదు ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. కాగా సెప్టెంబరులో ఇంగ్లండ్- ఆసీస్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది.
కాగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో రిక్కీ పాంటింగ్ టీమిండియా హెడ్‌కోచ్‌గా రానున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు తాను ఆసక్తిగా లేనని రిక్కీ చెప్పగా.. ఆ అవసరం తమకు లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా అతడికి కౌంటర్ ఇచ్చాడు. అనంతరం.. ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.
చదవండి: IND vs SL: 'భారత్‌లో అన్ని బ్యాటింగ్ పిచ్‌లే.. అందుకే ఇక్కడ ఆడలేకపోయారు'
Comments
Please login to add a commentAdd a comment