టీమిండియా విధ్వంసకర బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ (లోక్‌సభ) ప్రియా సరోజ్ పెళ్లాడబోతున్నారు. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తూఫానీ సరోజ్ తెలిపారు.
ప్రస్తుతం ప్రియా తిరువనంతపురంలో జరుగుతున్న పార్లమెంటరీ కమిటీ మీటింగ్‌తో బిజీగా ఉందని తూఫానీ పేర్కొన్నారు. రింకూ కూడా త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే టీ20 సిరీస్ సన్నాహకాల్లో నిమగ్నమయ్యాడని అన్నారు. రింకూ, ప్రియాల నిశ్చితార్థం జరిగిందని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అనంతరం రింకూ, ప్రియా ఎంగేజ్‌మెంట్, పెళ్లి తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. లక్నోలో ఎంగేజ్‌మెంట్ వేడుక జరుగుతుందని స్పష్టం చేశారు.
కాగా, రింకూ సింగ్, ప్రియా సరోజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని వారు డిసైడయ్యారు. తాజాగా ఇరువురి కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్లు ప్రియా తండ్రి వెల్లడించారు. స్నేహితురాలి తండ్రి ద్వారా ప్రియాకు రింకూతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది.
27 ఏళ్ల రింకూ భారత్ తరఫున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచ్లిషెహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్‌లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్‌పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు.
వారణాసికి చెందిన ప్రియా పాలిటిక్స్‌లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్‌లర్ డిగ్రీ పొందింది. ప్రియా తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేసింది. ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్‌పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
కాగా, ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రింకూ సింగ్ పాల్గొననున్నాడు. ఇందు కోసం అతను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment