నేను అవన్నీ పట్టించుకోను.. చూయింగ్‌ గమ్‌ నమిలితే తప్పు! అది నా ఇష్టం | Riyan Parag Gives A Tight Slap To Online Trolls | Sakshi
Sakshi News home page

#Riyan Parag: నేను అవన్నీ పట్టించుకోను.. చూయింగ్‌ గమ్‌ నమిలితే తప్పు! అది నా ఇష్టం

Published Sat, Aug 5 2023 12:23 PM | Last Updated on Sat, Aug 5 2023 12:57 PM

Riyan Parag Gives A Tight Slap To Online Trolls - Sakshi

ఐపీఎల్‌-2023లో విఫలమైన అస్సాం స్టార్‌ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌.. దేశవాళీ టోర్నీల్లో మాత్రం అదరగొడుతున్నాడు. ఇటీవల ముగిసిన దేవధర్ ట్రోఫీ 2023లో పరాగ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన పరాగ్‌ 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉంది. ఈ టోర్నీలో 23 సిక్సర్లు కొట్టిన రియాన్ పరాగ్, బౌలింగ్‌లోనూ 11 వికెట్లు తీశాడు. 

ఈ ఏడాది దేవ్‌ధర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు, అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా పరాగ్‌ నిలిచాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్ల నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌కు పరాగ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఆట కన్నా తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో ఎక్కువగా నిలిచాడు. విజయం సాధించినపుడు చేసుకునే సంబురాలు, క్యాచింగ్‌ సెలబ్రేషన్స్‌తో అతి చేసేవాడు. దీంతో అతడిపై చాలా సందర్భాల్లో సోషల్‌ మీడియాలో వేదికగా ట్రోలింగ్‌ జరిగింది.  తాజాగా తనపై ట్రోల్స్‌ చేస్తున్నవారికి పరాగ్ గట్టి కౌంటరిచ్చాడు.

ఇండియాన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాగ్‌ మాట్లాడుతూ.. "ప్రజలు నన్ను ఎందుకు ద్వేషిస్తారో నాకు బాగా తెలుసు. నేను చూయింగ్‌ గమ్‌ నమిలితే అది ఒక సమస్యే. అదే విధంగా నా టీషర్ట్‌ కాలర్‌పైకి పైకి ఉంటే అది నచ్చదు. నేను ఒక క్యాచ్‌ పట్టుకున్న తర్వాత సెలబ్రేషన్స్‌ చేసుకుంటే అది కూడా అందరి దృష్టిలో తప్పే. నేను ఖాళీ సమయంలో గోల్ఫ్ ఆడటం కూడా తప్పుగా భావిస్తారు "అని అసహనం వ్యక్తం చేశాడు.

వాటిని పట్టించుకోను..
"క్రికెట్ ఎలా ఆడాలి అనే దాని గురించి రూల్ బుక్ ఉంది. టీషర్ట్‌ టక్‌ చేసుకోవాలి, కాలర్ క్రిందికి ఉండాలి, ఎవరినీ స్లెడ్జ్ చేయకూడదు, ఇవన్నీ రూల్స్‌ అన్న సంగతి నాకు కూడా తెలుసు. వీటిన్నటికీ నేను వ్యతేరేకంగా ఉంటా కనుక ప్రజలకు నేను నచ్చను. నేను దేవ్‌ధర్ ట్రోఫీలో అద్బుతంగా రాణించాను. కాబట్టి అందరూ వావ్‌ వాట్‌ఏ టాలెంట్‌ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అదే తర్వాత ఒక్క మ్యాచ్‌లో విఫలమైతే చాలు, చెత్త ఆట అంటూ మాట్లాడుకుంటారు.

కాబట్టి అర్ధం లేని ట్రోల్స్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నాకు నచ్చిన విధంగానే ఉంటాను. ఇప్పటివరకు ఎవరూ కూడా నా దగ్గరకు వచ్చి నీలో ఈ సమస్య ఉందంటూ చెప్పలేదు. నేను నా లైఫ్‌ను ఎంజాయ్‌ చేయడానికి క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టాను. నేను ఇప్పటికీ సరదా కోసమే క్రికెట్‌ ఆడుతున్నాను. నేను ఎంజాయ్‌ చేస్తుంటే  ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు" అని చెప్పుకొచ్చాడు.
చదవండి:ఈ వెస్టిండీస్‌ క్రికెటర్‌ వారణాసి అమ్మాయిని పెళ్లాడాడు! వ్యాపారవేత్తగా ఆమె! అతడేమో..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement