ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో బోపన్న జోడీ (PC: Australian Open)
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట సంచలన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్-2024 మెన్స్ డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో థామస్- ఝాంగ్ ఝిషేన్ జోడీని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
అయితే, తొలి సెట్‌ను 6-3తో గెలిచిన బోపన్న- ఎబ్డెన్ జోడీ.. రెండో సెట్ మాత్రం 3-6తో కోల్పోయింది. ఈ క్రమంలో నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మూడో సెట్‌లో ఇరు జోడీలు అత్యుత్తమ ప్రదర్శనతో పోటాపోటీగా ముందుకు సాగాయి.
ఈ నేపథ్యంలో టై బ్రేకర్‌కు దారితీయగా.. బోపన్న- ఎబ్డెన్ ద్వయం ధామస్- ఝిషేన్ జంటను 7-6తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రోహన్ బోపన్న తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన అత్యంత ఎక్కువ వయసు గల ప్లేయర్(43 ఏళ్లు)గా మరోసారి చరిత్ర సృష్టించాడు.
ఇదిలా ఉంటే.. బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 2023లో ఎబ్డెన్‌తో కలిసి బోపన్న యూఎస్ ఓపెన్ ఫైనల్ ఆడాడు. 2013లోనూ ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తుదిపోరుకు బోపన్న అర్హత సాధించడం విశేషం.
కాగా కెరీర్ చరమాంకంలో బోపన్న ఉన్నత శిఖరానికి చేరుకున్న విషయం తెలిసిందే. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బోపన్న నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకోవడం ఖరారైంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరి మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు బోపన్న.
అలా వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ జోడీగా
బుధవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–4, 7–6 (7/5)తో మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మోల్టెని (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. దాంతో ఈనెల 29న విడుదలయ్యే ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న, ఎబ్డెన్ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ జోడీగా అవతరిస్తుంది. ఈ క్రమంలో టెన్నిస్ చరిత్రలోనే నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలవనున్న అతిపెద్ద వయస్కుడిగా రోహన్ బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) రికార్డు నెలకొల్పనున్నాడు.
వాళ్ల తర్వాత
ఇక... పురుషుల డబుల్స్‌లో ప్రస్తుతం ఈ రికార్డు అమెరికా దిగ్గజం మైక్ బ్రయాన్ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉంది. మహిళల డబుల్స్‌లో అమెరికా ప్లేయర్ లీసా రేమండ్ (39 ఏళ్లు; 2012లో)... పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (36 ఏళ్ల 320 రోజులు; 2018లో)... మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ (35 ఏళ్ల 124 రోజులు; 2017లో) వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన అతి పెద్ద వయస్కులుగా రికార్డు సృష్టించారు.
గర్వంగా ఉంది
‘నంబర్‌వన్ ర్యాంక్ అందుకోనుండటంతో గర్వంగా అనిపిస్తోంది. నా జీవితంలో ఇదో ప్రత్యేక క్షణం. ఈస్థాయికి చేరుకోవడానికి కోచ్‌లు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల పాత్ర ఎంతో ఉంది’ అని బోపన్న వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment