న్యూఢిల్లీ: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి భారత క్రికెట్ జట్టును ప‍్రకటించినప్పట్నుంచీ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం హాట్ టాపిక్ అయ్యింది. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడంతో పెద్ద ఎత్తున దుమారం లేచింది. ఈ ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత రోహిత్ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం కారణంగా పలు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రోహిత్ పాల్గొనలేదు. దీన్ని సాకుగా చూపి రోహిత్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదు. కనీసం రోహిత్‌కు సమాచారం ఇవ్వకుండా పర్యటన నుంచి తప్పించారు. దీనికి కోహ్లితో రోహిత్‌కు ఉన్న విభేదాలే కారణమని సోషల్ మీడియాలో హోరెత్తింది. ఇక మళ్లీ రోహిత్ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పాల్గొనడంతో అతన్ని పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపించింది. సునీల్ గావస్కర్ సైతం రోహిత్ గాయం నుంచి కోలుకోవడం శుభపరిణామం అని, అతన్ని ఆలస్యంగానైనా జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని మద్దతుగా నిలిచాడు.
అయితే తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం రోహిత్ శర్మ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఓపెనింగ్ అనేది చాలా కీలకమని పేర్కొన్నాడు. టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నాడు. ఆస్ట్రేలియాలో భారత్ రాణించాలంటే విరాట్ కోహ్లి కెప్టెన్సీ స్కిల్స్‌పైనే ఆధారపడి ఉంటుందన్నాడు. బౌలర్ల విషయంలో కానీ, బ్యాట్స్‌మెన్ విషయంలో కానీ కోహ్లి తీసుకుని నిర్ణయాలే కీలకమన్నాడు. ఈ మాట్లలో రోహిత్ మాట కూడా గంగూలీ నోటి నుంచి వచ్చింది. బ్యాటింగ్‌లో మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, రోహిత్ శర్మల్లో ఎవర్ని తుది జట్టులోకి తీసుకోవాలనేది కోహ్లి నిర్ణయంపైనే ఉంటుందన్నాడు. దాంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టులో రోహిత్‌ను చేర్చడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఫిట్‌నెస్ పరంగా రోహిత్ బానే ఉండటంతో అతని ఎంపిక అనివార్యమనే చెప్పాలి. రోహిత్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే అతన్ని జట్టులో ఎంపిక చేస్తామని గంగూలీనే స్వయంగా చెప్పాడు. ఇంకా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడానికి సమయం ఉండటంతో రోహిత్ ఫిట్‌నెస్ నిరూపించుకోవడం కష్టం కాకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment