రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాక టీమిండియా కెప్టెన్ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పదవి రేసులో తొలుత హార్దిక్ పాండ్యా ఒక్కడి పేరే వినిపించినప్పటికీ.. నిన్న మొన్నటి నుంచి సూర్యకుమార్ యాదవ్ కూడా రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. హార్దిక్ తరుచూ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటుంటాడన్న విషయాన్ని సాకుగా చూపుతూ బీసీసీఐలోకి కొందరు పెద్దలు సూర్య పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది.
తాజాగా ఈ అంశానికి సంబంధించి ఓ బిగ్ అప్‌డేట్ అందింది. సూర్యకుమార్‌కు బీసీసీఐలోని ఓ వర్గం అండదండలతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే 2026 టీ20 వరల్డ్‌కప్ వరకు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగే అవకాశం ఉంది. మరి కొద్ది గంటల్లో ఈ అంశం అధికారిక ప్రకటన వెలువడవచ్చు.
వాస్తవానికి శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును ఇవాళే ప్రకటించాల్సి ఉండింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సెలెక్షన్ కమిటీ భేటి వాయిదా పడింది. లంకలో పర్యటించే భారత జట్టుతో పాటు కొత్త టీ20 కెప్టెన్ పేరును రేపు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, భారత్.. శ్రీలంక పర్యటన ఈ నెల 27 నుంచి మొదలుకానుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment