నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విష‌యం చెప్ప‌లేను: రోహిత్‌ శర్మ | Rohit Sharmas Reply To Smriti Mandhanas Query Stumps Everyone | Sakshi
Sakshi News home page

నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విష‌యం చెప్ప‌లేను: రోహిత్‌ శర్మ

Published Sun, Feb 2 2025 10:02 AM | Last Updated on Sun, Feb 2 2025 10:52 AM

Rohit Sharmas Reply To Smriti Mandhanas Query Stumps Everyone

టీమిండియా వ‌న్డే, టెస్టు కెప్టెన్ రోహిత్‌​ శర్మ(Rohit Sharma)కు మతిమరుపు ఎక్కువన్నసంగతి తెలిసిందే. తన విలువైన వస్తువుల్ని రోహిత్‌ తరచుగా మర్చిపోతుంటాడని గతంలో సహచర ఆటగాడు విరాట్ కోహ్లి సైతం ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. తాజాగా ముంబైలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ విషయం సంబంధించి పలు ప్రశ్నలు రోహిత్‌కు ఎదురయ్యాయి.

ఈ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన(Smriti Mandhana)తో హిట్‌మ్యాన్ ఇంట్రాక్టయ్యాడు.  ఇటీవల మీ సహచరులు మిమ్మల్ని మీ హాబీల్లో దేనిపై ఆటపట్టించారు అని ‍మంధాన నుంచి రోహిత్‌కు ప్రశ్న ఎదురైంది.

"నా టీమ్‌మేట్స్ మతిమరుపుపై ఎక్కువగా టీజ్ చేస్తుంటారు. కానీ అది నా హాబీ కాదు. ఇటీవలే నా వ్యాలెట్‌,  పాస్‌పోర్ట్ మర్చిపోయానన్న వార్తల్లో నిజం లేదు. అది ఎప్పుడో పదేళ్ల కిందట జరిగిం‍ది అని రోహిత్ నవ్వుతూ బదులిచ్చాడు. దీంతో ఈ ఈవెంట్‌లో పాల్గోన్న మిగితా ఆటగాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.

అదేవిధంగా ఇప్పటివరకు మీ జీవితంలో మర్చిపోయిన పెద్ద విషయం ఏమైనా ఉందా? అని రోహిత్‌ను ఆమె ప్ర‌శ్నించింది. "నేను అది చెప్ప‌లేను. ఎందుకంటే ఈ కార్య‌క్ర‌మాన్ని నా భార్య లైవ్‌లో చూస్తుంటుంది. అందుకే ఆ విష‌యాన్ని నా మ‌న‌సులోనే ఉంచుకుంటాన‌ని" హిట్‌మ్యాట్ న‌వ్వుతూ చెప్పుకొచ్చాడు. 

ఉత్తమ ప్లేయర్లగా బుమ్రా, మంధాన..
ఇక నమన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్‌కు దిగ్గజాలు సచిన్ టెండూల్కర్‌, సునీల్ గావస్కర్, రవి శాస్రితో సహా భారత క్రికెటర్లు హాజరయ్యారు.  2023–24 సంవత్సరంలో ప్రదర్శనకుగానూ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌కు అందించే ‘పాలీ ఉమ్రీగర్‌ అవార్డు’ పురుషుల విభాగంలో మేటి పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను వరించగా... మహిళల విభాగంలో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఈ పురస్కారం దక్కించుకుంది. 

ఇక అంతర్జాతీయ స్థాయిలో 664 మ్యాచ్‌లాడి లెక్కకు మిక్కిలి అవార్డులు తన పేరిట లిఖించుకున్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు బీసీసీఐ ‘జీవన సాఫల్య’ పురస్కారం అందించింది. శనివారం ముంబైలో నిర్వహించిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) అధ్యక్షుడు జై షా చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న బుమ్రాకు ‘పాలీ ఉమ్రీగర్‌ అవార్డు’ దక్కగా... మహిళల విభాగంలో స్మృతి మంధాన నాలుగోసారి ఈ అవార్డుకు ఎంపికైంది. 

2017–18, 2020–21, 2021–22లోనూ స్మృతికి పాలీ ఉమ్రీగర్‌ పురస్కారం లభించింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్‌ అశ్విన్‌కు బోర్డు ప్రత్యేక పురస్కారం అందజేసింది. అత్యుత్తమ అంతర్జాతీయ అరంగేట్రం ఆటగాడి పురస్కారం సర్ఫరాజ్‌ ఖాన్‌ గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో ఈ పురస్కారం ఆశా శోభనకు దక్కింది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల అవార్డు కూడా స్మృతి మంధానకే దక్కింది. 

అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా దీప్తి శర్మ పురస్కారం గెలుచుకుంది. రంజీ ట్రోఫీలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్‌కు అందించే లాలా అమర్‌నాథ్‌ అవార్డు ముంబై ప్లేయర్‌ తనుశ్‌ కొటియాన్‌కు దక్కింది. దేశవాళీ టోరీ్నల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టుగా ముంబై నిలిచింది. రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌కు అందించే మాధవ్‌రావు సింధియా అవార్డుకు తెలంగాణ ప్లేయర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ దక్కించుకున్నాడు. 

ఇదే విభాగంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌ పురస్కారం గెలుచుకున్నాడు. ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లు ఆడుతుండటంతో శనివారం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు. వారి స్థానంలో ఆయా రాష్ట్ర సంఘాల ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు.
చదవండి: ఛాంపియన్స్‌ ట్రోఫీలో వారిద్దరిదే కీలక పాత్ర: గౌతం గంభీర్‌



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement