ఐపీఎల్ కొత్త సీజన్‌కు ఉత్కంఠభరిత ఆరంభం లభించింది. చివరి బంతి వరకు సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్‌కు ఓటమి ఎదురవగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. బౌలింగ్‌లో హర్షల్ ... ఆపై డివిలియర్స్ మెరుపు ప్రదర్శనతో ఆర్‌సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముందుగా బ్యాటింగ్ వైఫల్యంతో సాధారణ స్కోరుకే పరిమితమైన ముంబై ఇండియన్స్ ప్రత్యర్థికి సవాల్ విసరడంలో విఫలమైంది.
చెన్నై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ కొత్త సీజన్‌లో గెలుపు బోణీ చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్ పదునైన బౌలింగ్ (5/27)తో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు సాధించి గెలిచింది. డివిలియర్స్ (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కీలక భాగస్వామ్యం...
గత సీజన్‌లో జట్టుతో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా దక్కని క్రిస్ లిన్ ఈసారి తొలి మ్యాచ్‌లోనే బరిలోకి దిగి రోహిత్ శర్మ (19)తో కలిసి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాడు. అయితే సమన్వయ లోపంతో రోహిత్ రనౌట్ కావడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత లిన్, సూర్య కలిసి ధాటిగా ఆడి పరుగులు సాధించారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు 44 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. సూర్యను చక్కటి బంతితో అవుట్ చేసిన జేమీసన్ ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌ను సాధించగా... తర్వాత వచ్చిన కిషన్ కూడా జోరును కొనసాగించాడు. మరో ఎండ్‌లో సుందర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అతనికే క్యాచ్ ఇవ్వడంతో లిన్ ఇన్నింగ్స్ ముగిసింది. హార్దిక్ పాండ్యా (13) కూడా నిరాశపర్చాడు. 20వ ఓవర్లో ముంబై ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది. సాధారణంగా చివర్లో భీకరంగా చెలరేగిపోయే ముంబై చివరి 5 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే చేయగలిగింది.
హర్షల్ సూపర్...
గత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 5 మ్యాచ్‌లు ఆడిన హర్షల్ 3 వికెట్లే తీశాడు. తమ జట్టులో ఒక భారత పేస్ బౌలర్ అవసరం ఉండటంతో ఈ సీజన్ కోసం వేలానికి ముందు బెంగళూరు ‘ట్రేడింగ్ విండో’లో హర్షల్‌ను తీసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ‘నోబాల్’తో అతను బౌలింగ్ మొదలు పెట్టాడు. ఆపై లిన్ సిక్స్, సూర్య ఫోర్ బాదడంతో తొలి ఓవర్లో మొత్తం 15 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే 16వ ఓవర్లో తిరిగొచ్చిన అతను సత్తా చాటాడు.
హార్దిక్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన హర్షల్... తన తర్వాతి ఓవర్లో కిషన్‌ను కూడా ఇలాగే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్‌నైతే అతను శాసించాడు. భారీ షాట్లు ఆడే అవకాశం ఉన్న కృనాల్ (7), పొలార్డ్ (7)లను తొలి రెండు బంతుల్లో అవుట్ చేసిన అనంతరం త్రుటిలో హ్యాట్రిక్‌ను చేజార్చుకున్నాడు. అయితే నాలుగో బంతికి జాన్సెన్ (0)ను కూడా బౌల్డ్ చేయడంతో ఐదో వికెట్ అతని ఖాతాలో చేరింది. ముంబై భారీ స్కోరుకు సన్నద్ధమవుతున్న దశలో హర్షల్ స్పెల్ మ్యాచ్‌ను బెంగళూరు వైపు తిప్పింది.
డివిలియర్స్ మెరుపులు...
కోహ్లితో పాటు అనూహ్యంగా ఓపెనింగ్‌కు దిగిన వాషింగ్టన్ సుందర్ (10) ప్రభావం చూపలేకపోగా, కెరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రజత్ పటిదార్ (8)కు అదృష్టం కలసి రాలేదు. అయితే కోహ్లికి మ్యాక్స్‌వెల్ జత కలిశాక స్కోరు వేగం పెరిగింది. రాహుల్ చహర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన మ్యాక్సీ... కృనాల్ బౌలింగ్‌లో బాదిన సిక్స్ స్టేడియం పైకప్పును తాకింది. 2018 ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున సిక్స్ కొట్టిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు (171 బంతుల తర్వాత) అతను సిక్స్ కొట్టడం విశేషం! మూడో వికెట్‌కు 42 బంతుల్లో 52 పరుగులు జోడించిన అనంతరం ఐదు పరుగుల వ్యవధిలో కోహ్లి, మ్యాక్స్‌వెల్ అవుటయ్యారు.
ఈ దశలో గెలిపించే బాధ్యతను డివిలియర్స్ తీసుకున్నాడు. 35 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన స్థితిలో అతను చెలరేగిపోయాడు. చహర్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన ఏబీ... బౌల్ట్ ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ బాదాడు. బుమ్రా వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లతో 12 పరుగులు రాబట్టడంతో ఆర్‌సీబీ విజయం దాదాపుగా ఖాయమైంది. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా, నాలుగో బంతికి డివిలియర్స్ వెనుదిరిగాడు. అయితే ఆఖరి బంతికి ఉత్కంఠను అధిగమించి హర్షల్ సింగిల్ తీయడంతో జట్టు గెలుపు అందుకుంది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (రనౌట్) 19; లిన్ (సి అండ్ బి) సుందర్ 49; సూర్య (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 31; కిషన్ (ఎల్బీ) (బి) హర్షల్ 28; హార్దిక్ (ఎల్బీ) (బి) హర్షల్ 13; పొలార్డ్ (సి) సుందర్ (బి) హర్షల్ 7; కృనాల్ (సి) క్రిస్టియాన్ (బి) హర్షల్ 7; జాన్సెన్ (బి) హర్షల్ 0; చహర్ (రనౌట్) 0; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159.
వికెట్ల పతనం: 1–24, 2–94, 3–105, 4–135, 5–145, 6–158, 7–158, 8–158, 9–159.
బౌలింగ్: సిరాజ్ 4–0–22–0; జేమీసన్ 4–0–27–1; చహల్ 4–0–41–0; షహబాజ్ 1–0–14–0; హర్షల్ 4–0–27–5; క్రిస్టియాన్ 2–0–21–0; సుందర్ 1–0–7–1.
బెంగళూరు ఇన్నింగ్స్: సుందర్ (సి) లిన్ (బి) కృనాల్ 10; కోహ్లి (ఎల్బీ) (బి) బుమ్రా 33; పటిదార్ (బి) బౌల్ట్ 8; మ్యాక్స్‌వెల్ (సి) లిన్ (బి) జాన్సెన్ 39; డివిలియర్స్ (రనౌట్) 48; షహబాజ్ (సి) కృనాల్ (బి) జాన్సెన్ 1; క్రిస్టియాన్ (సి) చహర్ (బి) బుమ్రా 1; జేమీసన్ (రనౌట్) 4; హర్షల్ (నాటౌట్) 4; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం 20 ఓవర్లలో 8 వికెట్లకు) 160.
వికెట్ల పతనం: 1–36, 2–46, 3–98, 4–103, 5–106, 6– 122, 7–152, 8–158.
బౌలింగ్: బౌల్ట్ 4–0–36–1, బుమ్రా 4–0–26–2, జాన్సెన్ 4–0–28–2, కృనాల్ 4–0–25–1, చహర్ 4–0–43–0.
రోహిత్ శర్మ రనౌట్
ఐపీఎల్‌లో నేడు
చెన్నై సూపర్‌కింగ్స్ x ఢిల్లీ క్యాపిటల్స్
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment