ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే తండ్రి సురేశ్ కుసాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నజరానా పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అథ్లెట్లను గౌరవించే విషయంలో హర్యానా ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలంటూ హితవు పలికారు.
ప్యారిస్ వేదికగా ఈ ఏడాది ఆగష్టులో ముగిసిన ఒలింపిక్స్‌లో 29 ఏళ్ల స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో మూడోస్థానంలో నిలిచి ఈ పతకం కైవసం చేసుకున్నాడు. తద్వారా ఈ క్రీడాంశంలో ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. అది కూడా తన తొలి ప్రయత్నంలోనే పతక కలను అతడు సాకారం చేసుకోవడం విశేషం.
ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల చొప్పున
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ విషయం గురించి స్వప్నిల్ కుసాలే తండ్రి సురేశ్ కుసాలే తాజాగా మాట్లాడుతూ.. ‘‘హర్యానా ప్రభుత్వం ఒలింపిక్ మెడల్ గెలిచిన విజేతలకు ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల చొప్పున ఇచ్చింది.
అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన వారికి రూ. 2 కోట్ల నజరానా ఇవ్వాలనే కొత్త విధానం తీసుకువచ్చింది. మహారాష్ట్ర తరఫున విశ్వ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచిన రెండో అథ్లెట్ స్వప్నిల్. అతడు మెడల్ గెలిచినపుడే ఇలాంటి పాలసీ ఎందుకు తీసుకువచ్చారు?
ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఐదు వ్యక్తిగత పతకాలు వస్తే.. అందులో హర్యానా నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి స్వప్నిల్ ఒక్కడే ఉన్నాడు. మహారాష్ట్రతో పోలిస్తే హర్యానా చిన్న రాష్ట్రం. అయినా.. మెడల్ గెలిచిన అథ్లెట్లకు ఇక్కడి కంటే భారీ నజరానాలు, ప్రోత్సహకాలు ఇస్తోంది.
ఇక మా ప్రభుత్వం గోల్డ్ గెలిస్తే రూ. 5 కోట్లు, వెండి పతకం అందుకుంటే రూ. 3 కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 2 కోట్లు ఇస్తామని ప్రకటించింది. సుదీర్ఘకాలంగా మహారాష్ట్రకు వ్యక్తిగత విభాగంలో రెండే పతకాలు వచ్చినా ఇలాంటి పద్ధతి అవలంభించడం దేనికి? క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే వారిని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలి.
ఎమ్మెల్యే లేదంటే మంత్రి కొడుకు అయి ఉంటే
స్వప్నిల్ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. ఒకవేళ అతడు ఎమ్మెల్యే లేదంటే మంత్రి కొడుకు అయి ఉంటే ఇదే రివార్డు ఇచ్చేవారా? నిజానికి స్వప్నిల్‌కు రూ. 5 కోట్ల నగదు అవార్డుతో పాటు బెలేవాడిలోని స్పోర్ట్స్ స్టేడియానికి సమీపంలో ఒక ఫ్లాట్ ఇవ్వాలి. అంతేకాదు.. 50 మీటర్ల త్రీ పొజిషన్ రైఫిల్ షూటింగ్ ఎరీనాకు స్వప్నిల్ పేరు పెట్టాలి’’ అని సురేశ్ కుసాలే డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఒలింపిక్ పతకం గెలిచిన తర్వాత రైల్వే శాఖ స్వప్నిల్‌కు పదోన్నతి కల్పించింది. సెంట్రల్ రైల్వేలోని పుణె డివిజన్‌లో 2015లో కమర్షియల్–కమ్–టికెట్ క్లర్క్‌గా చేరిన కుసాలేను ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
చదవండి: జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?.. టీమిండియా ఇక్కడకు రావాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment