ట్రోఫీ గెలిచిన సంబరాల్లో ఇండియా లెజెండ్స్(PC: Road Safety World Series Twitter)
Road Safety World Series 2022 Winner: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2022 ఫైనల్లో ఇండియా లెజెండ్స్ ఘన విజయం సాధించింది. శ్రీలంక లెజెండ్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని ముద్దాడింది. నమన్ ఓజా అద్భుత సెంచరీ(71 బంతుల్లో 108 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు, నాటౌట్)తో జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ ఈ టైటిల్ గెలవడం వరుసగా ఇది రెండోసారి.
సచిన్ మెరుపులు చూద్దామనుకుంటే!
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వేదికగా శనివారం జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్లో టాస్ గెలిచిన ఇండియా లెజెండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్, కెప్టెన్ సచిన్ టెండుల్కర్ మెరుపులు చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.
కులశేఖర బౌలింగ్‌లో సచిన్ గోల్డెన్ డకౌగా వెనుదిరిగాడు. వన్‌డౌన్ బ్యాటర్ సురేశ్ రైనా (4 పరుగులు) సైతం విఫలమయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వినయ్ కుమార్ 36 పరుగులతో రాణించగా.. మిగిలిన వాళ్లలో యువరాజ్ సింగ్ 19, ఇర్ఫాన్ పఠాన్ 11 పరుగులు చేశారు.
అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా నమన్ ఓజా ఆఖరి వరకు పట్టుదలగా నిలబడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా లెజెండ్స్ 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కులశేఖరకు మూడు, ఇసురు ఉడానాకు రెండు వికెట్లు, ఇషాన్ జయరత్నేకు ఒక వికెట్ దక్కాయి.
ఆదిలోనే షాక్.. ఆపై
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్ ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజేశ్ పవార్ బౌలింగ్‌లో దిల్షాన్ మునవీర 8 పరుగులు, వినయ్‌కుమార్ బౌలింగ్‌లో సనత్ జయసూర్య 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. కెప్టెన్ తిలకరత్నె దిల్షాన్(11 పరుగులు) సహా ఉపుల్ తరంగ(10) సైతం నిరాశపరిచాడు.
ఈ క్రమంలో అసీల గుణరత్నె(19), జీవన్ మెండిస్(20) కాసేపు పోరాడగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ జయరత్నె అర్ధ శతకం(22 బంతుల్లో 51 పరుగులు)తో చెలరేగి లంక శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అయితే, వినయ్ కుమార్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఆ తర్వాత మహేల ఉదవటె(19 బంతుల్లో 26 పరుగులు) జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. టాపార్డర్ వైఫల్యం కారణంగా శ్రీలంక లెజెండ్స్ 18.5 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో వరుసగా రెండోసారి ట్రోఫీ ఇండియా లెజెండ్స్ కైవసమైంది.
మాజీ క్రికెటర్ల లీగ్.. ఉద్దేశమేమిటంటే..
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు గతేడాది నుంచి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ పేరిట ఇంటర్నేషనల్ టీ20 లీగ్ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు ఇందులో భాగమయ్యారు. మొదట్లో ఇండియా, ఇంగ్లండ్, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు మాత్రమే ఉండగా.. ఈ ఏడాది న్యూజిలాండ్ లెజెండ్స్ సైతం చేరింది.
కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సహకారంతో భారత రోడ్డు రవాణ, హైవేలు, ఐటీ మంత్రిత్వ శాఖ, యువజన క్రీడా శాఖ కలిసి ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నాయి.
చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్
National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment