చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు (PC: CSK/IPL)
IPL 2024- MS Dhoni- CSK: చెన్నై సూపర్‌కింగ్స్ భావి కెప్టెన్ ఎవరన్న అంశంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత చెన్నై జట్టును ముందుకు నడిపించగల సత్తా రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రమే ఉందని అభిప్రాయపడ్డాడు.
ధోని రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, టెస్టు సారథి బెన్‌స్టోక్స్‌కు కెప్టెన్సీ అప్పగించాలనే ఉద్దేశంతో సీఎస్‌కే ఫ్రాంఛైజీ భారీగా ఖర్చు పెట్టిందని.. అయితే, అనుకున్న ఫలితాలు మాత్రం రాబట్టలేకపోయిందని పేర్కొన్నాడు. అందుకే వేలానికి ముందు అతడిని వదిలేసిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ
కాగా ఐపీఎల్-2024 వేలానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆటగాళ్లను రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకునే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ క్రమంలో.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సహా డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాన్షు సేనాపతి, ఆకాశ్ సింగ్, కైలీ జెమీసన్, సిసంద మగలను చెన్నై విడుదల చేసింది.
(PC: CSK/IPL)
ఈ లిస్టులో ఖరీదైన ప్లేయర్ బెన్‌స్టోక్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత వేలంలో రూ. 16.25 కోట్ల భారీ మొత్తానికి అతడిని కొనుగోలు చేసిన సీఎస్‌కే.. ధోని తర్వాత తదుపరి కెప్టెన్ చేయాలని భావించినట్లు తెలిసింది. అయితే, గాయాల కారణంగా తుదిజట్టులో కూడా అందుబాటులో లేకుండా పోయిన స్టోక్స్ పూర్తిగా నిరాశపరిచాడు.
తప్పుకొంటాననగానే వదిలేసిన సీఎస్‌కే
ఈ క్రమంలో తాను ఐపీఎల్ నుంచి తప్పుకొంటున్నట్లు స్టోక్స్ ప్రకటించగా.. సీఎస్‌కే కూడా అందుకు అంగీకరించి అతడిని వదిలేసింది. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘సీఎస్‌కే పూర్తి చేయాలని భావిస్తున్న పనుల్లో ముఖ్యమైనది కెప్టెన్సీ.
ధోని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ పగ్గాలు చేపడతాడనే భావిస్తున్నా. అంబటి రాయుడు చెప్పినట్లు రుతుకు ఆ అర్హత ఉంది. బెన్‌స్టోక్స్ విషయంలో కెప్టెన్సీ కోసం ఆలోచించిన సీఎస్‌కే అందుకోసం భారీగా ఖర్చుపెట్టింది.
స్టోక్స్ ఉంటే మంచిదే గానీ..
నిజానికి అతడు సమర్థవంతమైన నాయకుడు. అలాంటి అనుభవజ్ఞుడు కెప్టెన్‌గా ఉంటే జట్టుకు ఉపయోగకరం. కానీ ఇప్పుడు అతడు టీమ్‌తో లేడు’’ అని పేర్కొన్నాడు. ఇక మరో ఆల్‌రౌండర్‌ను వెదికే క్రమంలో చెన్నై మరోసారి శార్దూల్ ఠాకూర్ వైపు మొగ్గు చూపడం ఖాయం అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్‌లో అశూ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్య వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టు విజయవంతమైన కెప్టెన్‌గా రుతురాజ్ దూసుకుపోతున్నాడు. బ్యాటర్‌గానూ ఈ ఓపెనర్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. కోహ్లి రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment