మేజర్ లీగ్ క్రికెట్ 2024లో సీటెల్ ఓర్కాస్ వరుసగా మూడో ఓటమి చవి చూసింది. ఈ లీగ్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓర్కాస్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.
ఓర్కాస్ బ్యాటర్లంతా విఫలమైనప్పటకి ఆ జట్టు ఓపెనర్, దక్షిణాఫ్రికా స్టార్ ర్యాన్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రికెల్టన్ నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.
నైట్‌రైడర్స్ బౌలర్లలో జాన్సన్, రస్సెల్, నరైన్, డ్రై తలా వికెట్ సాధించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.
47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అతడితో పాటు జాసన్ రాయ్ 27 పరుగులతో రాణించాడు. సీటెల్ ఓర్కాస్ బౌలర్లలో గనూన్, హార్మత్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎంగిడీ, కీమో పాల్ చెరో వికెట్ సాధించారు. ఏదమైనప్పటకి సీటెల్ ఓర్కాస్ ఓటమి పాలవ్వడంతో ర్యాన్ రికెల్టన్ అద్భుత ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment