సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ముక్కోణపు టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆతిథ్య జట్టును 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టోర్నీలో భాగంగా ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 39 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 30.4 ఓవర్లలోనే 129 పరుగులకు చాపచుట్టేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్టిన్ ఖుమాలో (8-1-42-4), క్వేనా మపాకా (8-0-44-3), రిలే నార్టన్ (5-0-17-1), జుయాన్ జేమ్స్ (7-0-26-1), రొమాషన్ పిల్లే (6-1-20-1) రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహీముల్లా జుర్మతి (47), జంషిద్ జద్రాన్ (33), హస్సన్ ఎయిసఖిల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా వారంతా విఫలమయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. ఆఫ్ఘన్ బౌలర్లు అల్లా ఘజన్ఫర్ (9-1-36-4), అరబ్ గుల్ మొమంద్ (5.4-0-13-4), బషీర్ అహ్మద్ (5-0-35-1), ఫరీదున్ దావూద్‌జాయ్ (5-0-23-1) ధాటికి 129 పరుగులకు కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రిటోరియస్ (51) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ టోర్నీలో తదుపరి మ్యాచ్‌లో భారత్-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. జనవరి 2న ఈ మ్యాచ్ జరుగనుంది. టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్.. ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment