భారత టీ20 జట్టు తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్‌లో తన బ్యాటింగ్ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 12) జరిగిన రెండో టీ20లో మెరుపు అర్ధసెంచరీ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించిన స్కై.. 10 రేటింగ్ పాయింట్లు అదనంగా కూడగట్టుకుని, తన సమీప ప్రత్యర్ధులందరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.
ప్రస్తుతం స్కై ఖాతాలో 865 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న మొహమ్మద్ రిజ్వాన్ ఖాతాలో 787 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం 78 పాయింట్లుగా ఉంది. టాప్ 10 ర్యాంకింగ్స్‌లో స్కై తర్వాత 700కు పైగా పాయింట్లు కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే ఉన్నాయి. రిజ్వాన్ 787, మార్క్రమ్ 758, బాబర్ ఆజమ్ 734 పాయింట్లు కలిగి ఉన్నారు.
టాప్-10 ఉన్న మరో భారత ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (ఏడో ర్యాంక్) అనారోగ్యం కారణంగా సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడలేకపోవడంతో అతని ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. సూర్యకుమార్ ప్రస్తుత ఫామ్‌ను మరికొద్ది రోజుల పాటు కొనసాగించగలిగితే టీ20 వరల్డ్‌కప్ 2024లో టాప్ ర్యాంకింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడు.
మరోవైపు సౌతాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడిన రింకూ సింగ్ ఏకంగా 46 స్థానాలు మెరుగుపర్చుకుని 59వ స్థానానికి చేరగా.. అదే మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ప్లేస్‌కు చేరాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. పొట్టి ఫార్మాట్‌లో ఇటీవలే టాప్ ర్యాంక్ దక్కించుకున్న భారత అప్‌కమింగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్.. సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడే అవకాశం రాకపోవడంతో ఎలాంటి రేటింగ్ పాయింట్లు సాధించలేకపోయాడు. ప్రస్తుతానికి రవి తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నప్పటికీ.. ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రూపంలో అతనికి ప్రమాదం పొంచి ఉంది.
ప్రస్తుతం ఈ ఇద్దరు బౌలర్లు సమానంగా 692 రేటింగ్ పాయింట్లు కలిగి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. టాప్ 10లో రవి మినహా భారత్ నుంచి ఎవ్వరికీ ప్రాతినిథ్యం లభించకపోగా.. హసరంగ, ఆదిల్ రషీద్, తీక్షణ, సామ్ కర్రన్, ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్, అకీల్ హొసేన్, తబ్రేజ్ షంషి వరుసగా 3 నుంచి 10 స్థానాలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment