దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ విజయంతో ఆరంభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు మాత్రమే చేసింది.
ప్రోటీస్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(97 బంతుల్లో 86 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్‌క్రమ్(35), రికెల్టన్(36), టోనీ డీజోర్జీ(33) రాణించారు. పాక్ బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ సల్మాన్ ఆఘా 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ ఆర్బర్ ఆహ్మద్ రెండు, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్ తలా వికెట్ సాధించారు.
అయూబ్ సూపర్ సెంచరీ..
ఇక 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 119 బంతులు ఎదుర్కొన్న అయూబ్.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు.
మరోవైపు బంతితో మాయ చేసిన సల్మాన్ అలీ అఘా బ్యాట్‌తో కూడా సత్తాచాటాడు. 90 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, బార్టమన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమ్సీ, జానెసన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 19న కేప్‌టౌన్ వేదికగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment