
సెంచూరియన్: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. అరంగేట్ర మ్యాచ్‌లో బంతితో 4 వికెట్లు పడగొట్టిన కార్బిన్ బాష్ (93 బంతుల్లో 81 నాటౌట్; 15 ఫోర్లు) బ్యాట్‌తోనూ విజృంభించాడు. లోయర్ ఆర్డర్ అండతో పాకిస్తాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా బాష్ రికార్డుల్లోకెక్కాడు.
ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 82/3తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 73.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య సఫారీ జట్టుకు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ మార్క్‌రమ్ (144 బంతుల్లో 89; 15 ఫోర్లు) 11 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు.
కెప్టెన్ బవుమా (31; 4 ఫోర్లు), బెడింగ్‌హమ్ (30; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కైల్ వెరిన్ (2), మార్కో యాన్సెన్ (2) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షహజాద్, నసీమ్ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు) అయూబ్ (28; 6 ఫోర్లు), కమ్రాన్ గులామ్ (4) అవుట్ కాగా... బాబర్ ఆజమ్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
చేతిలో 7 వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 2 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో జన్సెన్ 2 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment