Sachin Tendulkar hit me with the bat says Virender Sehwag - Sakshi
Sakshi News home page

సచిన్‌ నన్ను బ్యాట్‌తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్‌ అయ్యాడు: సెహ్వాగ్‌

Published Thu, Apr 13 2023 11:43 AM | Last Updated on Thu, Apr 13 2023 12:26 PM

Sachin Tendulkar Hit Me says Virender Sehwag - Sakshi

వీరేంద్ర సెహ్వాగ్‌

వీరేంద్ర సెహ్వాగ్.. భారత క్రికెట్‌ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఒక యువ క్రికెటర్‌గా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని  భారత జట్టులో అడుగుపెట్టిన సెహ్వాగ్.. తన ఆరాధ్య దైవంతోనే ఓపెనింగ్‌ స్థానాన్ని పంచుకున్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌తో కలిసి భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను వీరేంద్రుడు అందించాడు.

సొంత గడ్డపై 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా సొంతం చేసుకోవడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. కాగా వీరూ, సచిన్‌ ఫీల్డ్‌లోనే కాకుండా బయట కూడా మంచి స్నేహితులు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. అయితే 2011 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా సచిన్‌తో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను సెహ్వాగ్ స్టార్‌స్పోర్ట్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

కాగా సెహ్వాగ్‌కు బ్యాటింగ్ చేసేటప్పుడు పాటలు పాడే అలవాటు ఉందని మనందరికీ తెలుసు. అతడు తన రిథమ్‌ను పొందడానికి బ్యాటింగ్‌ చేసేటప్పుడు పాటలు పాడుతూ ఉంటాడు. అయితే  2011 వన్డే ప్రపంచకప్‌లో తన అలవాటు సచిన్‌కు చిరాకు తెప్పించిందని సెహ్వాగ్‌ తెలిపాడు. అంతేకాకుండా మాస్టర్‌ బ్యాట్‌తో తనను సరదగా కొట్టాడని సెహ్వాగ్‌ చెప్పాడు.

"మేము 2011 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో ఆడుతున్నాం. నేను బ్యాటింగ్ చేస్తూ పాటలు పాడుతున్నాను. ఈ సమయంలో సచిన్‌ కూడా మంచి టచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మాస్టర్‌కు  ఓవర్ల మధ్య మాట్లాడే అలవాటు ఉంది, కానీ నేను అస్సలు మాట్లాడను. నేను ఏకాగ్రత పొందేందుకు పాటలు పాడుతుంటాను.

అలా తొలి మూడు ఓవర్ల పాటు జరిగింది. నాలుగో ఓవర్‌ తర్వాత సచిన్‌ వెనుక నుండి వచ్చి నన్ను బ్యాట్‌తో కొట్టాడు. సచిన్‌ నా దగ్గరకు వచ్చి నీవు అలా కిషోర్‌ కుమార్‌లా పాటలు పాడుతూ ఉంటే నేను పిచ్చివాడిని అవుతాను అంటూ అన్నాడు" అంటూ సెహ్వాగ్‌ స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ తొలి వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సెహ్వాగ్‌(73) పరుగులు చేయగా.. సచిన్‌(111) సెంచరీతో చెలరేగాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ అనూహ్యంగా ప్రోటీస్‌ జట్టు చేతిలో ఓటమిపాలైంది.
చదవండి: IPL 2023: ఓటమి బాధలో ఉన్న చెన్నైకి బిగ్‌ షాక్‌! ధోనికి గాయం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement