18 పరుగులతో అమెరికాపై గెలుపు
గెలిపించిన డికాక్, రబాడ
ఆండ్రియెస్ గూస్ పోరాటం వృథా
నార్త్‌సౌండ్: ప్రపంచ కప్ లీగ్ దశలో పెద్ద జట్లలో కనిపించిన అలసత్వం, చిన్న స్కోరుకే పడిన ఆపసోపాలు సూపర్–8కు వచ్చేసరికి దూరమైనట్లున్నాయి. బోర్ కొట్టించిన స్కోర్ల స్థానంలో ఆసక్తికర ధనాధన్ సమరం టి20 మజాను పంచింది. దీంతో ఆడుతున్న తొలి టి20 ప్రపంచకప్‌లోనే ముందంజ వేసిన అమెరికా ఆటలు ఈ దశ (సూపర్–8)లో సాగలేదు. పటిష్టమైన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్ దెబ్బకు ఆతిథ్య అమెరికా ఓడింది.
బుధవారం జరిగిన తొలి సూపర్–8 పోరులో సఫారీ టీమ్ 18 పరుగుల తేడాతో అమెరికా జట్టుపై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డికాక్ (40 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ షో చేశాడు. మరో ఓపెనర్ రిజా హెండ్రిక్స్ (11) విఫలమైనా... వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మార్క్‌రమ్ (32 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) అండతో రెండో వికెట్‌కు చకచకా 110 పరుగులు జోడించాడు.
తర్వాత 126 పరుగుల స్కోరు వద్ద డికాక్, మిల్లర్ (0) అవుటయ్యారు. అయితే హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 36 నాటౌట్; 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 20 నాటౌట్) ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. అనంతరం అమెరికా కొంత పోరాడినా లక్ష్యానికి దూరంగా ఉండిపోయింది. ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ అండ్రియెస్ గూస్ (47 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు.
అతనికి జోడీగా దిగిన స్టీవెన్ టేలర్ (14 బంతుల్లో 24; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా వేగంగా పరుగులు సాధించడంతో 3.2 ఓవర్లలోనే అమెరికా 33 పరుగులు చేసింది. కానీ మరుసటి బంతికి టేలర్ అవుటయ్యాక జట్టు నిలబడలేకపోయింది. నితీశ్ కుమార్ (8), కెపె్టన్ ఆరోన్ జోన్స్ (0), కోరీ అండర్సన్ (12), జహంగీర్ (3) ఇలా వచ్చి అలా వెళ్లి పోయారు.
హర్మీత్ దేశాయ్ (22 బంతుల్లో 38)తో గూస్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరు కాసేపు భారీ షాట్లతో వణికించారు. అయితే హర్మీత్‌ను రబాడ (3/18) అవుట్ చేయడంతో ఆశలు ఆవిరయ్యాయి.
టి20 ప్రపంచకప్‌లో నేడు
వెస్టిండీస్ X ఇంగ్లండ్
వేదిక: గ్రాస్ ఐలెట్; ఉ.గం.6.00 నుంచి
భారత్ X అఫ్గానిస్తాన్
వేదిక: బ్రిడ్జ్‌టౌన్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment