సియాదతుల్లా సిద్దిఖి- సాయి ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా పుల్లెల గోపీచంద్ అకాడమీలో కోచ్‌గా పని చేస్తున్న మొహమ్మద్ సియాదతుల్లా సిద్దిఖి అకాడమీని వీడనున్నాడు. అమెరికాలోని ఒరెగాన్ బ్యాడ్మింటన్ అకాడమీలో సియాదతుల్లా కోచ్‌గా చేరనున్నాడు.
40 ఏళ్ల సియదతుల్లా భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్ తదితరుల వెంట పలు అంతర్జాతీయ టోర్నీల్లో కోచ్‌గా వెళ్లాడు.
‘నా బావ మరిది అమెరికాలో ఉంటున్నాడు. అతను ఈ ప్రతిపాదన తెచ్చాడు. ప్రతిపాదన బాగుండటంతో అంగీకరించాను. ఈనెల 7వ తేదీన అమెరికాకు వెళుతున్నాను. జూన్‌లో కుటుంబసభ్యులు అమెరికాకు వస్తారు’ అని సియాదతుల్లా తెలిపాడు.
అమెరికాలో బ్యాడ్మింటన్ అకాడమీ హెడ్ కోచ్‌గా సాయిప్రణీత్
భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుల్లో ఒకడైన భమిడిపాటి సాయిప్రణీత్ ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. త్వరలో హెడ్ కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. వచ్చే నెలలో అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీ హెడ్ కోచ్‌గా 31 ఏళ్ల సాయిప్రణీత్ బాధ్యతలు తీసుకోనున్నాడు.
2008 నుంచి అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిప్రణీత్ చివరిసారి గత ఏడాది డిసెంబర్‌లో గువాహటి మాస్టర్స్ టోర్నీలో పోటీపడి రెండో రౌండ్‌లో ఓడిపోయాడు. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సాయిప్రణీత్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి లీగ్ దశలో నిష్క్రమించాడు. 2019లో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ అందుకున్నాడు.
►కెరీర్ మొత్తంలో సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి సాయిప్రణీత్ 417 మ్యాచ్‌లు ఆడాడు. 243 మ్యాచ్‌ల్లో నెగ్గి, 174 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.
►2020లో కెరీర్ బెస్ట్ 10వ ర్యాంక్‌ను అందుకున్న సాయిప్రణీత్ ప్రస్తుతం 106వ ర్యాంక్‌లో ఉన్నాడు.
►2019లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గడం సాయిప్రణీత్ కెరీర్‌లో హైలైట్. 2017లో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కూడా సాధించాడు.
►2016లో కెనడా గ్రాండ్‌ప్రి, 2017లో థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి టోర్నీల్లోనూ విజేతగా నిలిచాడు.
►2016, 2020లలో జరిగిన ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
►2010లో మెక్సికోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో, 2008లో కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో సాయిప్రణీత్ కాంస్య పతకాలు గెలిచాడు.
►బ్యాడ్మింటన్‌లో మేటి క్రీడాకారులైన లిన్ డాన్, చెన్ లాంగ్ (చైనా), లీ చోంగ్ వె (మలేసియా), తౌఫిక్ హిదాయత్ (ఇండోనేసియా), కెంటో మొమోటా (జపాన్), టామీ సుగియార్తో (ఇండోనేసియా), ఆంథోని జిన్‌టింగ్ (ఇండోనేసియా)లపై సాయిప్రణీత్ విజయాలు నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment