సాక్షి, హైదరాబాద్: భారత మహిళల బ్యాడ్మింటన్‌లో వస్తున్న కొత్త తరం ఆటగాళ్లలో దూకుడు లోపించిందని ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించే ధాటైన ఆట వారి నుంచి రావాలని ఆమె సూచించింది. సరిగ్గా చెప్పాలంటే తనతో పాటు సింధు తర్వాత వచ్చిన ప్లేయర్లు ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారని సైనా చెప్పింది. ‘నిజాయితీగా చెప్పాలంటే మా ఇద్దరికీ, కొత్తగా వచ్చిన మహిళా షట్లర్లకు మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది. మ్యాచ్ ఆరంభం నుంచి అటాక్ చేసే
మాలాంటి ప్లేయర్లు ఇప్పుడు భారత్‌కు కావాలి. త్వరలోనే మహిళల బ్యాడ్మింటన్‌లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా’ అని సైనా పేర్కొంది. ‘బ్యాడ్మింటన్ ప్రోస్’ పేరుతో కొత్తగా రానున్న బ్యాడ్మింటన్ అకాడమీకి సైనా మెంటార్‌గా వ్యవహరించనుంది. మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్, విజయ్ లాన్సీ కలిసి దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొంది.
‘ప్రోస్ అకాడమీకి ప్రత్యేక కోచ్‌ల బృందం ఉంది. నాకున్న అనుభవాన్ని వారితో పంచుకునేందుకే మెంటార్‌గా పని చేయబోతున్నా. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బ్యాడ్మింటన్ అకాడమీలు రావడం సానుకూల పరిణామం’ అని సైనా పేర్కొంది. భారత షట్లర్ పారుపల్లి కశ్యప్, ప్రస్తుతం భారత టీమ్ కోచ్‌ల బృందంలో ఒకడైన గురుసాయిదత్ కూడా ఈ అకాడమీకి మెంటార్‌లుగా పని చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment