సీనియర్స్ విభాగంలో విజయం సాధించిన ఎంఎల్‌ఆర్‌ఐటీ టీం
Sakshi Premier League 2022- ఇబ్రహీంపట్నం: సాక్షి ప్రీమియర్ లీగ్ పోటీలు సోమవారం సందడిగా ముగిశాయి. గ్రేటర్ హైదరాబాద్ రీజినల్ విజేతలుగా సీనియర్స్ విభాగంలో దుండిగల్ ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాల, జూనియర్స్ విభాగంలో ఈసీఐఎల్ గౌతమ్ జూనియర్ కళాశాల జట్లు నిలిచాయి. ఔత్సాహిక క్రికెటర్లను ప్రొత్సహించేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో 3వ సీజన్ క్రికెట్ టోర్నీ శేరిగూడలోని శ్రీఇందు విద్యాసంస్థల మైదానంలో గత నెల 19న ప్రారంభమైన విషయం తెలిసిందే.
జిల్లాస్థాయి విజేతలతో సోమవారం గ్రేటర్ హైదరాబాద్ రీజినల్ స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించారు. విజయం సాధించిన జట్లకు శ్రీఇందు విద్యాసంస్థల చైర్మన్ ఆర్. వెంకట్‌రావు, సుధాకర్ పీవీసీ పైప్స్ రీజినల్ మేనేజర్ రంగారావు, సంస్థ సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నరేష్‌కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌రావు మాట్లాడుతూ.. సాక్షి మీడియా గ్రూపు క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు.
మున్ముందు ఇలాంటి టోర్నీలు నిర్వహిస్తే సహకరిస్తామని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. టోర్నీకి స్పానర్స్‌గా వ్యవహరించిన సుధాకర్ పీవీసీ పైప్స్ సంస్థతోపాటు క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సుధాకర్ పీవీసీ సంస్థ రీజినల్ మేనేజర్ రంగారావు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నైపుణ్యం సాధించాలన్నారు. తల్లిదండ్రులు ఈవిషయంలో ప్రోత్సహించాలని చెప్పారు.
సమావేశంలో సుధాకర్ పైప్స్ సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నరేష్‌కుమార్ మాట్లాడుతూ.. టీర్నీని విజయవంతం చేసిన సాక్షి మీడియాకు అయన ధన్యవాదాలు తెలిపారు. ఎస్‌పీఎల్‌కు రీఫ్రెష్‌మెంట్ డ్యూక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుధాకర్ పీవీసీ సంస్థలు తెలంగాణ రీజినల్ స్పాన్సర్స్‌గా వ్యవహరించాయి.
ఫైనల్స్‌లో ఇలా..
రీజినల్ జూనియర్ విభాగంలో ఈసీఐఎల్ గౌతమ్ జూనియర్ కళాశాలతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు తలపడింది. మొదట గౌతమ్ కళాశాల 105 పరుగులు సాధించింది. అనంతరం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 81 పరుగులు సాధించి ఓటమిపాలైంది. గౌతమ్ కాలేజీ ఆడగాడు అశ్లేష్ 30 బాల్స్‌లో 44 పరుగులు సాధించి ఉత్తమ ప్రతిభ చాటాడు.
రీజినల్ సీనియర్స్ విభాగంలో దుండిగల్ ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజీ జట్టు, మహబూబ్‌నగర్ వాసవీ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టు పోటీపడింది. ఎంఎల్‌ఆర్‌ఐటీ జట్టు 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. అనంతరం మహబూబ్‌నగర్ వాసవీ కాలేజీ టీం 69 పరుగులు సాధించి ఓటమిపాలైంది. ఎంఎల్‌ఆర్‌ఐటీ జట్టు విజయ్ 17 బాల్స్‌లో 34 పరుగులను సాధించి ప్రతిభచాటాడు.
ఉత్సాహంగా బహుమతుల ప్రదానం
బహుమతుల ప్రదానోత్సవం ఉత్సాహంగా సా గింది. జాతీయ గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.జూనియర్ విభాగంలో ఈసీఐఎ ల్ గౌతమ్ కాలేజీ, సీనియర్ విభాగంలో దుండిగ ల్ ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజీ జట్లు విజేతలుగా నిలిచాయి. రన్నర్స్‌గా సైనిక్‌పురి భవన్స్ కళాశాల జ ట్లు నిలిచాయి. జూనియర్ విభాగంలో గౌతమ్ కాలేజీ జట్టు, దుండిగల్ ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజీ జట్లు విజయం సాధించారు.
విన్నర్స్, రన్నర్స్‌కు షీల్డ్‌లను, సర్టిఫికెట్లను ముఖ్యఅతిథులు అందజేశారు. ఇందు కాలేజీ తరఫున పాల్గొన్న రెండు జట్లను చెర్మన్ వెంకట్రావ్ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. రీజినల్ స్థాయిలో విజేతలైన జట్లు 10 తర్వాత జరిగే రాష్ట్ర స్థాయి ఎస్‌పీఎల్ పోటీల్లో తలపడుతాయి. కార్యక్రమంలో సాక్షి ఈ వెంట్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉగ్రగిరిరావు, ఇందు కాలేజీ ఏఓ బాలకృష్ణారెడ్డి,సత్యనారాయణ, పీడీ నరసింహ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment