సాక్షి, హైదరాబాద్: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, ఆరు గ్రాండ్‌స్లామ్‌ల విజేత సానియా మీర్జా టెన్నిస్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఆమె సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను కలిసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) ఆధీనంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌ను ఇందు కోసం కేటాయించాలని ఆమె ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. సానియా మీర్జా అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో కోచింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తానని సానియా చెప్పింది. మరో వైపు తన మొయినాబాద్‌లోని తన సొంత అకాడమీని అవసరమైతే ప్రభుత్వం జిల్లాలనుంచి టెన్నిస్ క్రీడాకారులకు శిక్షణ, వసతి కోసం వినియోగించుకోవచ్చని కూడా పేర్కొంది. జిల్లాకు 15–20 మందిని ఎంపిక చేసి వారికి విదేశీ కోచ్‌ల ద్వారా శిక్షణ ఇప్పించే ఏర్పాట్లు చేస్తానని కూడా ఆమె హామీ ఇచ్చింది. సానియా అభ్యర్థనను పరిశీలిస్తామని, త్వరలో జరిగే కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment