ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టెస్టు సిరీస్ కి ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. ఈ సిరీస్ ఏ ఆటగాడికైనా ఒక అగ్ని పరీక్ష వంటింది. ఈ పరీక్షకి తట్టుకుని నిలబడ్డ ఆటగాడికి భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
మరి అందరికీ అలాంటి అవకాశం రాదుగా? వచ్చినా సద్వినియోగం చేసుకోగల నైపుణ్యం, చతురత, గుండె నిబ్బరం, అన్నిటికీ మించి ఆ ఒత్తిడికి తట్టుకుని నిలువ గల మానసిక స్థైర్యం కావాలి. ఇవన్నీ తనకు పుష్కలంగా ఉన్నాయి అని నిరూపించాడు 21 ఏళ్ళ విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.
వికెట్ కీపర్ రిషబ్ పంత్ అవుటైన తర్వాత, ఆస్ట్రేలియా సాధించిన 474 పరుగుల స్కోర్ కి సమాధానంగా 191 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి భారత్ ఫాలోఆన్ ఉచ్చులో చిక్కుకున్న తరుణంలో బ్యాటింగ్ కి వచ్చిన నితీష్ కుమార్ ఎంతో నిబద్దతతో, బాధ్యతాయుతంగా ఆడాడు.
ఎలాంటి ఒత్తిడి ని కనబరచకుండా తన సహజ సిద్ధ శైలి తో బ్యాటింగ్ చేశాడు. హేమాహేమీలైన తన జట్టులో సీనియర్ బ్యాటర్ లాగా ఎక్కడా సహనాన్ని కోల్పోలేదు. తడబాటు కనబరచలేదు ఏంటో పరిణతి చెందిన బ్యాట్ లాగా ఒకొక్క ఇటుక పేర్చుకుంటూ తన ఇన్నింగ్స్ ని నిర్మించాడు.
సిసలైన టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ని గట్టెక్కించాడు. ఈ దశలో నితీష్ కి వాషింగ్టన్ సుందర్ నుంచి మంచి సహకారం లభించింది. ఈ ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్ల ని ధీటుగా ఎదుర్కొన్నారు. ఎక్కడా వెన్నుచూపలేదు. ఆస్ట్రేలియా కొత్త బంతి తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది.
చివరికి వెటరన్ స్పిన్నర్ నేథన్ లియాన్ వీరిద్దరి భాగస్వామ్యాన్ని బద్దలు చేసిన సమయానికి భారత్ ఫాలో ఆన్ గట్టెక్కడం కాక ఈ టెస్ట్ ని డ్రా చేయగలమనే ధీమాకి చేరుకుందంటే, వీరిద్దరి ఎనిమిదో వికెట్ కి నెలకొల్పిన 127 పరుగుల భాగస్వామ్యం అంత అమూల్యమైనది.
వాషింగ్టన్ సుందర్ నిష్క్రమించే సమయానికి నితీష్ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. తదుపరి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా వెంటనే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ లో అవుటైనా, హైదరాబాద్ ఆటగాడు మొహమ్మద్ సిరాజ్ మూడు బంతులని నిలువరించి నితీష్ కుమార్ మెల్బోర్న్ లో బాక్సింగ్ డే వంటి ఏంతో ప్రితిష్టాత్మకమైన టెస్ట్ లో సెంచరీ సాధించేందుకు దోహదం చేసాడు.
'భారత్ కి మరో రవి శాస్త్రి దొరికాడు'
మెల్బోర్న్ లో తన తొలి టెస్ట్ సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డి ని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ముఖ్యంగా నితీష్ ఆటతీరు భారత్ మాజీ కోచ్ రవి శాస్త్రి తో పోలి ఉందని, మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. శాస్త్రి తరహాలో కొద్దిగా బౌలింగ్ వచ్చిన బ్యాటర్‌గా గా జట్టులోకి వచ్చిన నితీష్ ఇప్పుడు జట్టులోని ప్రధాన బ్యాటర్‌గా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నాడు. అతని బాటింగ్ స్థానాన్ని జట్టు మానేజిమెంట్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నితీష్ భారత బ్యాటింగ్ అర్దర్లో పైకి పైకి ఎగబాకి గతంలో రవి శాస్త్రి లాగా త్వరలో ఓపెనర్ గా వచ్చినా ఆశ్చర్యం లేదని, మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. అయితే నితీష్ తన బౌలింగ్ ని కొద్దిగా మెరుగు పరుచుకుంటే, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారత్‌కి ఒక మంచి ఆల్ రౌండర్ జట్టుకి లభించినట్టే. ఫలితం ఎలా ఉన్న, భారత్ కి ఈ సిరీస్ లో ఒక అద్భుతమైన ఆణిముత్యం లభించినట్టే!
Comments
Please login to add a commentAdd a comment